Share News

జనగణనకు ప్రజలు సహకరించాలి: ప్రభుత్వం

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:46 PM

ఏపీలో జనగణనకు ప్రజలు సహకరించాలని కూటమి ప్రభుత్వం కోరింది. మార్చి 12న కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

జనగణనకు ప్రజలు సహకరించాలి: ప్రభుత్వం
Andhra Pradesh Census News

అమరావతి: దేశవ్యాప్తంగా 2027 జనగణన ప్రక్రియ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జనగణన నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో జనగణనను దశలవారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్‌లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు ప్రజలకు 15 రోజులపాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం కల్పించనున్నారని సమాచారం. అలాగే మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరగబోయే 2027 జనగణన ప్రక్రియకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కూటమి ప్రభుత్వం కోరింది. 1948 జనగణన చట్టం ప్రకారం ప్రజల విధులు, బాధ్యతలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జనగణన నిర్వహణ కోసం వచ్చే సిబ్బందికి ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని ప్రభుత్వం సూచించింది. నిబంధనల ప్రకారం జనగణన సిబ్బందికి ప్రశ్నలు అడిగే అధికారం ఉందని, వారు కోరిన సమాచారాన్ని సరైన విధంగా అందించాలని తెలిపింది.


అలాగే, సెన్సస్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారాన్ని ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంది. తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటి యజమానులు సెన్సస్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని, ఇళ్లకు వేసే గుర్తులు లేదా నంబర్లు తొలగించడం నేరమని స్పష్టం చేసింది. అలాగే సెన్సస్ ఫారమ్‌లను సరిగ్గా నింపడం కూడా ప్రజల బాధ్యతగా పేర్కొంది.

సెన్సస్ చట్టం 1948 ప్రకారం నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించింది. జనగణన అధికారులకు సహకరించని వారికి రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండొచ్చని హెచ్చరించింది. అయితే, జనగణన కోసం సేకరించిన వ్యక్తిగత వివరాలను ఇతరులు పరిశీలించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది. జనగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని ప్రభుత్వం పేర్కొంది.


Also Read:

రక్త చరిత్రే రాజనీతి అని వైసీపీ భావిస్తోంది: మంత్రి నిమ్మల

వైసీపీ నేతల్లారా.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి: మంత్రి జనార్దన్ రెడ్డి..

For More Latest News

Updated Date - Apr 12 , 2026 | 04:09 PM