Share News

రక్త చరిత్రే రాజనీతి అని వైసీపీ భావిస్తోంది: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:20 PM

వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ రక్త చరిత్రను రాజకీయం‌గా మార్చుకుందని, ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రక్త చరిత్రే రాజనీతి అని వైసీపీ భావిస్తోంది: మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu Comments On YCP

అమరావతి: మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రక్త చరిత్రనే రాజకీయం‌గా మార్చుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


విధ్వంసం, వినాశనాలతో కూడిన మహిళా, యువజన విధానాలను వైసీపీ రూపొందించిందని నిమ్మల మండిపడ్డారు. 'చంపేస్తాం, నరుకుతాం, అంతం చేస్తాం' అనే విధానంతో వైసీపీ ముందుకు సాగుతోందని అన్నారు. అధికారంలోకి వస్తే పనులు నిలిపివేయడం, నిర్మాణాలను కూల్చివేయడం, యువతను చెడగొట్టడం వంటి చర్యలు చేపడతామని వైసీపీ చెబుతోందని విమర్శలు గుప్పించారు.


సొంత వారినీ వదలని చరిత్ర వైసీపీది

ఇంకా మాట్లాడుతూ.. రాజకీయాలకు అడ్డొస్తే సొంత వారినీ వదలని చరిత్ర వైసీపీదని, వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే పరిటాల రవి, వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన సాక్షులు, నిందితులు అనుమానాస్పదంగా మరణించిన విషయంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజలను, మీడియాను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా నిమ్మల ఆరోపించారు. ఆంధ్రజ్యోతి పత్రికను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. గుంటూరు ప్రాంతంలో ప్రజలను బెదిరించే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.


వైసీపీకి ఆ అర్హత లేదు

వంగవీటి రంగాను హత్య చేసిన కుటుంబం ప్రస్తుతం ఏ పార్టీలో ఉందో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. వంగవీటి రంగాను రౌడీగా అభివర్ణించిన గౌతమ్ రెడ్డికి పదవి ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి తన వద్ద చేర్చుకున్నారని విమర్శించారు. రంగాను హత్య చేసిన కుటుంబానికి వేల కోట్ల రూపాయల లాభం చేకూరేలా హైదరాబాద్‌లో ఆస్తులు కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కాపుల గురించి, వంగవీటి రంగాపై మాట్లాడే అర్హత వైసీపీకి, జగన్‌కు లేదని స్పష్టం చేశారు. చివరగా, 'గొడ్డలి పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టాలి' అంటూ మంత్రి నిమ్మల పిలుపునిచ్చారు.


Also Read:

క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు: మంత్రి సత్యకుమార్

వైసీపీ నేతల్లారా.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి: మంత్రి జనార్దన్ రెడ్డి..

For More Latest News

Updated Date - Apr 12 , 2026 | 03:47 PM