చంద్రబాబు నేడు ఆలోచించేది.. రేపు దేశం ఆచరిస్తుంది: కేంద్ర మంత్రి చౌహాన్
ABN , Publish Date - Oct 04 , 2026 | 02:23 PM
పేదల సొంతింటి కల నెరవేర్చాలనేది సీఎం చంద్రబాబు నాయుడి సంకల్పమని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. చంద్రబాబు సంకల్ప బలం చాలా గొప్పదని అన్నారు.
తెనాలి, అక్టోబర్ 04: పేదల సొంతింటి కల నెరవేర్చాలనేది సీఎం చంద్రబాబు నాయుడి సంకల్పమని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. చంద్రబాబు సంకల్ప బలం చాలా గొప్పదని అన్నారు. ఆదివారం తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో రాష్ట్రవ్యాప్తంగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను ఆయన తప్పక నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ 3లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలోపు.. మరో 3లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఇళ్ల నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ దేశానికి రోల్‌మోడల్ అవుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ షైనింగ్ స్టేట్‌గా మారే దశ ప్రారంభమైందని అన్నారు. ఏపీలోని ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చేది సీఎం చంద్రబాబు మాత్రమేనని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు విజన్ గొప్పదని చెప్పారు. సీఎం చంద్రబాబు ఓ పని అనుకున్నారంటే అది పూర్తయ్యే వరకు ఆగరని తెలిపారు.
చంద్రబాబు నేడు ఆలోచించేది.. రేపు దేశం ఆచరిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఏపీ టెక్నాలజీలో దూసుకెళ్తోందని అన్నారు. ఏఐ డేటా సెంటర్లు, క్వాంటమ్ టెక్నాలజీ చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని అభివర్ణించారు. దేశానికి ఏపీ దిక్సూచిగా మారబోతుందని తెలిపారు. రాజధాని అమరావతిని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. చంద్రబాబు ఆలోచనతో అమరావతి ఐకాన్‌గా మారనుందని అన్నారు.
సీఎం చంద్రబాబును మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. తెనాలి అంటే ప్రతిభకు మారుపేరని తెలిపారు. తాను మధ్యప్రదేశ్‌కే కాదు.. ఏపీకి కూడా మామయ్యనేనని చమత్కరించారు. పేదల సొంతింటి కలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెరిపేశారని విమర్శించారు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు గమనించారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: కవిత డిమాండ్
బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు: మంత్రి లోకేశ్