కోనసీమలో గ్రౌండ్ రెంట్ భూములకు విముక్తి
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:19 AM
ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న 9వ తేదీ వచ్చింది. ఈ సారి 1400 మంది నివాసితులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల భూసమస్యకు సర్కారు పరిష్కారం చూపింది. కోనసీమ జిల్లాల్లో గ్రౌండ్ రెంట్ భూములున్న నివాసాలకు నిషేధ విముక్తి కల్పించింది.
22ఏ నుంచి నివాస స్థలాల తొలగింపు
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు.. నేడు అంబాజీపేట
మండలంలో లబ్ధిదారులతో సీఎం భేటీ
నేరుగా వారి ఇళ్లకే వెళ్లి మాట్లాడనున్న చంద్రబాబు
రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ
అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న 9వ తేదీ వచ్చింది. ఈ సారి 1400 మంది నివాసితులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల భూసమస్యకు సర్కారు పరిష్కారం చూపింది. కోనసీమ జిల్లాల్లో గ్రౌండ్ రెంట్ భూములున్న నివాసాలకు నిషేధ విముక్తి కల్పించింది. నాలుగు మండలాల పరిధిలోని ప్రజలకు ఇది భారీ ఊరట. నివాసాలున్న భూములకు నిషేధ విముక్తి కల్పించడంతోపాటు వారి పేరిట శాశ్వత హక్కులు కల్పించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజలతో సమావేశం కాబోతున్నారు. ఆయన చేతులమీదుగానే ఈ సమస్యకు అధికారిక పరిష్కారం చూపిస్తూ ప్రకటన చేయించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ జిల్లాలోని అంబాజీపేట, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం మండలాల్లో గ్రౌండ్ రెంట్ భూములున్నాయి. ఇవి వాస్తవానికి పోరంబోకు భూములు. వార్షిక అద్దెతో ప్రజలకు నివాస స్థలాల కోసం ఇచ్చారు. రీసెటిల్‌మెంట్ రిజిస్టర్(ఆర్‌ఎస్ఆర్)లో గ్రౌండ్ రెంట్‌గానే వివరించారు. ఈ భూములపై 2015కి ముందు అనేక లావాదేవీలు జరిగాయి. అయితే 2016లో ఆ భూములను నిషేధ జాబితాలో చేర్చారు. ఇవన్నీ కలిపి 56.374 ఎకరాలు. నాలుగు మండలాల పరిధిలో ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లు నిషేధ జాబితాలోకి వెళ్లాయి.
వాటిని 22ఏ నుంచి తొలగించాలని గత కొన్నేళ్లుగా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి అభ్యర్థన మేరకు సదరు భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని కోనసీమ కలెక్టర్ జూలై 7వ తేదీన భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)కి ప్రతిపాదనలు పంపించారు. ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి, నివాసితులకే శాశ్వత హక్కులు కల్పించేలా ఉత్తర్వులివ్వాలని సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం తాజాగా ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నాలుగు మండలాల పరిధిలో ఉన్న గ్రౌండ్ రెంట్ భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు (జీవో 565) జారీ చేశారు. దీనివల్ల 1416 మంది నివాసిత కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇకపై ఆ భూములపై నివాసితులకే శా శ్వత హక్కులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ, కోనసీమ కలెక్టర్‌ను ఆదేశించింది. మండ లాలవారీగా భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నట్లుగా కలెక్టర్ పూర్తి వివరాలతో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తారని సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారమైందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి...
బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..
‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’