వేదవతి ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:25 AM
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యాం వేదవతి (హగరి) నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. రూ.1942.80 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు పరిపాలనా ఆమోదం లభించింది.
రూ.1942.80 కోట్లతో పరిపాలనా ఆమోదం
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యాం వేదవతి (హగరి) నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. రూ.1942.80 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు పరిపాలనా ఆమోదం లభించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి వేదవతి నిర్మాణం కోసం 2019 జనవరి 29నే నాటి చంద్రబాబు ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. అప్పట్లో దీని అంచనా వ్యయం 1799.80 కోట్లు. అయితే 2019లో జగన్ సీఎం అయ్యాక ఇతర సాగునీటి ప్రాజెక్టులతో పాటు దీనినీ మూలపడేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని ప్రాధాన్య ప్రాజెక్టుగా పరిగణించి పూర్తిచేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లా సరిహద్దులో ఆలూరు, ఆదోని నియోజకవర్గాల మీదుగా వేదవతి (హగరి) నది ప్రవహిస్తుంది. దీని నుంచి ఏటా 30-45 టీఎంసీల వరద జలాలు తుంగభద్రలో కలుస్తున్నాయి. ఆ నీటిని ఎత్తిపోసి ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యం.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి