కేడర్లు మారితే కొత్త రోస్టర్!
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:18 AM
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా స్థానిక కేడర్ల పునర్ వ్యవస్థీకరణ, రోస్టర్ల నిర్వహణ, పోస్టుల భర్తీలో స్థానిక రిజర్వేషన్లు, భర్తీ ప్రక్రియను క్రమబద్ధీకరించడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేడర్లు మారితే కొత్త రోస్టర్!
హారిజాంటల్ రిజర్వేషన్లకూ అదే వర్తింపు
13 జిల్లాలకు పాత రోస్టర్ల కొనసాగింపు
మరో 13 జిల్లాలకు కొత్త రోస్టర్లు అమలు
రాష్ట్రపతి ఉత్తర్వులపై మార్గదర్శకాలు
రోస్టర్లు, పోస్టుల భర్తీ, రిజర్వేషన్లపై స్పష్టత
సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మేరకు మార్పు
హారిజాంటల్ రిజర్వేషన్లకూ అదే వర్తింపు.. 13 జిల్లాలకు పాత రోస్టర్లు కొనసాగింపు
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా స్థానిక కేడర్ల పునర్ వ్యవస్థీకరణ, రోస్టర్ల నిర్వహణ, పోస్టుల భర్తీలో స్థానిక రిజర్వేషన్లు, భర్తీ ప్రక్రియను క్రమబద్ధీకరించడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ వంటి కొన్ని నిర్దిష్ట రాష్ట్రస్థాయి పోస్టులను మల్టీజోన్ కేడర్లుగా వర్గీకరించారు. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టులను జోనల్, మరికొన్ని పోస్టులను జోన్ నుంచి మల్టీజోన్‌కు లేదా జిల్లా నుంచి జోనల్ కేడర్‌కు మార్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో ఈ కొత్త నిబంధనలను ఒకే విధంగా, పారదర్శకంగా అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం బుధవారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది
1. రోస్టర్ పాయింట్ల నిర్వహణ
రాష్ట్ర కేడర్ నుంచి మల్టీజోన్/జోన్/జిల్లా కేడర్‌కు మారినా లే దా ఇదే క్రమంలో రివర్స్‌గా మారినా కొత్త రోస్టర్ విధానం వర్తిస్తుంది. ఈ మార్పులు జరిగినప్పుడు రోస్టర్ పాయింట్ 1 నుంచి కొత్తరోస్టర్ ప్రారంభించాలి. ఇది ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1966లోని రూల్ 22 ప్రకారం జరుగుతుంది.
2. ఫీడర్ కేడర్ రొటేషన్ సైకిల్
ఒకదాని కంటే ఎక్కువ ఫీడర్ కేడర్లు ఉండి, వాటి నియామక యూనిట్లలో మార్పులు వచ్చినప్పుడు, పైస్థాయి పోస్టుకు ప్రమోషన్ ఇచ్చే నిర్దేశిత నిష్పత్తి లేదా రొటేషన్ పద్ధతిని ఏపీస్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1966లోని 4(బీ)(4) ప్రకారం మళ్లీ కొత్తగా ప్రారంభించాలి.
3. ప్రమోషన్లలో రిజర్వేషన్లు
కొత్తగా ప్రారంభించే రోస్టర్ విధానం ప్రమోషన్లకు కూడా వర్తిస్తుంది. ఎస్సీ(గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3), ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన 33.3 హారిజాంటల్ రిజర్వేషన్ల విషయంలో ఈ నిబంధనలు వర్తిస్తాయి.
4. క్యారీఫార్వర్డ్ ఖాళీల భర్తీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించిన పాత ఖాళీల భర్తీ నిబంధనలు కొనసాగుతాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3ల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన రిజర్వ్‌డ్ బ్యాక్‌లాగ్(క్యారీఫార్వర్డ్) ఖాళీలను, కొత్త నోటిఫికేషన్ ద్వారా జనరల్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి ముందే సంబంధిత రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. లోకల్ కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ తేదీ నాటికి ఉన్న అన్ని క్యారీఫార్వర్డ్ ఖాళీలను సంవత్సరం వారీగా గుర్తించి, పాత సంవత్సరం ఖాళీలను ముందుగా భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విడివిడిగా జాబితాలు నిర్వహించాలి.
5. కొత్త యూనిట్లకు ఖాళీల పంపిణీ
పాత జిల్లాల విభజన జరిగినందున వాటి పరిధిలోని క్యారీఫార్వర్డ్ ఖాళీలను కొత్తగా ఏర్పడిన జిల్లాల ఉద్యోగుల సంఖ్యాబలం ఆధారంగా పంపిణీ చేస్తారు. ఒకే ఒక్క క్యారీ ఫార్వర్డ్ ఖాళీ ఉంటే దానిని ఏ కొత్త జిల్లాలో అయితే ఎక్కువ ఉద్యోగుల సంఖ్యాబలం ఉందో ఆ జిల్లాకు కేటాయిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఎక్కువ సంఖ్యాబలం ఉన్న జిల్లా నుంచి తక్కువ ఉన్న జిల్లాకు కేటాయిస్తారు. ఖాళీల శాతాన్ని లెక్కించేటప్పుడు 0.5 లేదా అంతకంటే ఎక్కువ వస్తే దానిని తదుపరి పూర్తిసంఖ్యగా పరిగణిస్తారు. 0.5కంటే తక్కువ వస్తే దానిని విస్మరిస్తారు. కేటాయించిన క్యారీఫార్వర్డ్ ఖాళీలను రూల్ 22 ప్రకారం రొటేషన్ పద్ధతిలోనే భర్తీ చేయాలి. స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడే ఏవైనా కొత్త క్యారీఫార్వర్డ్ ఖాళీలను ఆయా కొత్త జిల్లాలే స్వతంత్రంగా నిర్వహించుకోవాలి.
6. ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్
జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లలో జరిగే అన్ని ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించాలి. జిల్లాస్థాయిలోని నాన్ గెజిటెడ్ పోస్టులకు కూడా స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరాగ్రాఫ్ 7లోని నిబంధనల ప్రకారమే అభ్యర్థి స్థానికతను ఖరారు చేస్తారు.
7. 5 శాతానికి నిబంధనలు
మొత్తం పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకు పోగా మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. ఈ 5 శాతం పోస్టులకు లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు ఇద్దరూ పోటీ పడవచ్చు. ప్రత్యక్ష నియామకం జరిగే సమయంలో ఓపెన్ పోటీ కోసం కనీసం ఒక పోస్టు అయినా అన్‌రిజర్వ్‌డ్‌గా మిగలాలి.
8. ఖాళీల అంచనా
ప్రతిజిల్లా, జోన్, మల్టీ జోన్ పరిధిలో ఉద్యోగుల సంఖ్యాబలాన్ని నిర్ణయించి, ఖాళీలను విడిగా అంచనా వేయాలి. 2025, డిసెంబరు 15 తర్వాత జరిగిన నియామకాలు, పదోన్నతులు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని నిబంధనలకు లోబడి పునఃసమీక్ష, సర్దుబాట్లకు అవకాశముంది.
9. నియామక ఏజెన్సీలకు వివరాలు
ఖాళీలను నోటిఫై చేసేముందు ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. తర్వాత సంబంధిత శాఖాధిపతులు, కేడర్లు, కేటగిరీల వారీగా, రిజర్వేషన్ల వారీగా నివేదికలను సిద్ధం చేసి ఏపీపీఎస్పీ, ఇతర నియామక ఏజెన్సీలకు సమర్పించాలి.
10. పాత రోస్టర్ కొనసాగే జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ(తూర్పుగోదావరి రోస్టర్), ఏలూరు(పశ్చిమగోదావరి రోస్టర్), కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, జోన్-1, జోన్-3, జోన్-4, జోన్-6.
11. కొత్త రోస్టర్ ప్రారంభమయ్యే జిల్లాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోన సీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, మల్టీజోన్లు, అనుబంధ జోన్లు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..