ఉత్తరాంధ్రకు గోదారమ్మ
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:04 AM
మరో సంకల్పం సిద్ధించబోతోంది. ఉమ్మడి విశాఖ జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. గోదావరి జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు తరలించే ప్రక్రియలో కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది.
మరో సంకల్ప సిద్ధికి వేళాయె.. నేడే అనకాపల్లికి గోదావరి జలసిరి
పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల.. పాయకరావుపేటలో జలహారతి ఇవ్వనున్న సీఎం
అనకాపల్లి జిల్లా మెట్ట ప్రాంతాలకు సాగునీటి భరోసా.. దశలవారీగా 1,48,000 ఎకరాలకు నీరు
ఎడమ కాలువతో ఏలేరు కాలువ, తాండవ, వరహా, శారదా నదుల అనుసంధానం
4.23 లక్షల మందికి తాగునీరు.. 3 నియోజకవర్గాల పరిధిలో 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో కలిపాక మొత్తం 2,87,320 ఎకరాలకు చేరిక
అనకాపల్లి/పాయకరావుపేట/అమరావతి/కాకినాడ/రాజమహేంద్రవరం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): మరో సంకల్పం సిద్ధించబోతోంది. ఉమ్మడి విశాఖ జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. గోదావరి జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు తరలించే ప్రక్రియలో కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. పంపా, తాండవ, వరహా, శారద నదులను దాటుకుంటూ తూర్పు కనుమల గుండా దారిచేసుకుంటూ గోదారి ఉత్తరాంధ్రకు తరలిరానుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద చంద్రబాబు గోదావరి జలాలకు హారతి ఇస్తారు. అనంతరం నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి 1.4 కిలోమీటర్ల మేర నిర్మించిన కాలువను ఎడమ ప్రధాన కాలువకు అనుసంధానించారు. 10 పంపుల ద్వారా ఎడమ కాలువలోకి పంపిస్తారు. సోమవారం రాత్రి నుంచే ఈ పంపింగ్ ప్రక్రియ మొదలైంది. 110 కిలోమీటర్లు ప్రయాణించి తుని-నర్సీపట్నం రహదారిపై పాయకరావుపేట వద్ద నిర్మించిన అక్విడెక్టుకు నేరుగా చేరుకుంటాయి. అక్కడే సీఎం చంద్రబాబు జలహారతి ఇస్తారు. తర్వాత ఇవి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని తరలిస్తారు. ఇన్నాళ్లూ వర్షాలు, బోర్లు, చెరువులపై ఆధారపడి సాగుచేస్తున్న మెట్ట రైతులకు గోదావరి జలాలు అందుబాటులోకి రానున్నాయి.
సవాళ్లను అధిగమిస్తూ..
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం నేలకోట గ్రామం నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ మొదలవుతుంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం వరకు కాలువ నిర్మాణం పూర్తయింది. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు ఐదేళ్లలో రూ.398 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. కూటమి రెండేళ్లలో రూ.1,270 కోట్లు వ్యయం చేసింది. తూర్పుకనుమల భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ ఈ ఎడమ కాలువ నిర్మాణం సాగింది.
కాకినాడ జిల్లా ఎర్రవరం సమీపంలో ఏలేరు నది కింద నుంచి పోలవరం ఎడమ కాలువ వెళ్లేలా సైఫన్ నిర్మించారు.
తుని-పాయకరావుపేట మధ్య తాండవ నదిపై 447 మీటర్ల పొడవున అక్విడెక్టు నిర్మించారు. దీని ప్రవాహ సామర్థ్యం 10,634 క్యూసెక్కులు.
అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద వరహా నదిపై 1,250 మీటర్ల పొడవున భారీ అక్విడెక్టు నిర్మించారు. ఆరు ఖానాల ద్వారా పది వేల క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేలా దీనిని డిజైన్ చేశారు.
తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్ట్ నుంచి పాయకరావుపేట శివారు వరకు రెండు కి.మీ. మేర 3 కొండలను 80-90 మీటర్ల లోతు వరకు తవ్వారు.
2019 ఏప్రిల్ నాటికే 72శాతం పూర్తి..
పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎడమ కాలువ తవ్వకం పనులు సుమారు రెండు దశాబ్దాల క్రితం మొదలయ్యాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో ప్రధానమైన అక్విడెక్టులు, సైఫన్లు, వంతెనలు, అండర్‌పాసేజ్‌లు, ఇతర కట్టడాల పనులు చేపట్టలేదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఈ కాలువ పనులు ఊపందుకున్నాయి. 2019 ఏప్రిల్ నాటికి రూ.1560.35 కోట్ల విలువైన పనులు (దాదాపు 72 శాతం) పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పోలవరం పనులను అటకెక్కించింది. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత తిరిగి మొదలయ్యాయి.
ఎడమ కాలువ ద్వారా ప్రస్తుత కేటాయింపులిలా..
ఎడమ కాలువ నుంచి 250 క్యూసెక్కుల నీటిని ఏలేరు కాలువలోకి విడుదల చేస్తారు. 57.88 కిలోమీటరు వద్ద పంపా నదిలోకి 700 క్యూసెక్కులు విడుదల చేస్తారు. మరో 75 క్యూసెక్కుల నీటిని తాండవ నది పరీవాహక ప్రాంతంలోని భూమి, ముఠా ఆనకట్టల్లోకి మళ్లిస్తారు. 150 క్యూసెక్కులను వరహా నదిలోకి.. 150 క్యూసెక్కుల నీటిని మామిడివాక గెడ్డ ద్వారా శారదా నదిలోకి వదులుతారు. గోదావరి నీరు అందుబాటులోకి రావడం అనకాపల్లి జిల్లాకు వరంగా మారనుంది. దశలవారీగా 1,48,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి పరిధిలో సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. జిల్లాలో 143 గ్రామాల్లో 4.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. భవిష్యత్‌లో మలిదశలో ఎడమ కాలువ పూర్తయి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అనుసంధానం చేశాక 2,87,320 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు.
ఈ వార్తలను కూడా చదవండి
సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: కలిశెట్టి