రేపే అనకాపల్లికి గోదారి
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:34 AM
గోదావరి జలాలు అనకాపల్లి వరకు ఉరకలు వేయనున్నాయి. బుధవారం పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తుని సమీపంలో నర్సీపట్నం రోడ్డును క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నీరు విడుదల చేయనున్నారు.
తుని సమీపంలో నిర్మించిన అక్విడెక్టు వద్ద సీఎం జలహారతి
అనంతరం గేట్లెత్తి నీటి విడుదల
తొలి దశలో 1,48,000 ఎకరాలకు నీరు
2,87,320 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
143 గ్రామాలకు చెందిన 4.23 లక్షల మందికి తాగునీరు
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తొలిఅడుగు
మలి దశలో విశాఖకు నీరు
ఆ తర్వాత చీపురుపల్లి గడిగెడ్డ వరకు అంచనా వ్యయం రూ.17,050 కోట్లు
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలు అనకాపల్లి వరకు ఉరకలు వేయనున్నాయి. బుధవారం పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తుని సమీపంలో నర్సీపట్నం రోడ్డును క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నీరు విడుదల చేయనున్నారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రవాసుల స్వప్నంగా మారిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తొలి అడుగు పడనుంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 36 ప్రాజెక్టులను 2028నాటికి పూర్తి చేయాలని సంకల్పించిన చంద్రబాబు.. ఒక్కో ప్రాధాన్య ప్రాజెక్టునూ క్రమంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. హంద్రీ-నీవా విస్తరణ పనులను రికార్డు స్థాయిలో 100 రోజుల్లోనే పూర్తిచేయించి.. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలు తరలించారు. దుర్భిక్షం కోరల్లో నలిగిపోతున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీటితో పాటు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపే వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను సోమవారం ప్రారంభించారు. గోదావరి జలాలు తమ ప్రాంతంలో పారాలన్న ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను బుధవారం తీర్చనున్నారు. ఆ రోజు ఆయన తుని-నర్సీపట్నం రహదారిపై నిర్మించిన అక్విడెక్టు వద్ద గోదావరికి జల హారతి ఇస్తారు. తర్వాత అక్విడెక్టు గేట్లను ఎత్తి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఇవి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లి తరలిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి నీళ్లు ఎత్తిపోస్తారు.
ఇవీ లాభాలు..
అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేయడం వల్ల 110 చెరువులు నిండుతాయి. 1,48,000 ఎకరాలకు సాగునీరు దక్కుతుంది. పోలవరం ఎడమ కాలువతో ఏలేరు నది అనుసంధానం కావడం వల్ల ఏలేరు ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుంది. ఫలితంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని 80,700 ఎకరాలు, పంపా ఆయకట్టు పరిధిలో 12,000 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. తాండవ, వరాహ, మావిడివాక గెడ్డ (శారదా నది) కూడా అనుసంధానం కావడం వల్ల పాయకరావుపేట, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని చెరువులన్నీ నిండుతాయి. 46,620 ఎకరాలకు సాగునీందుతుంది. మొత్తంగా అనకాపల్లి దాకా గోదావరి జలాల చేరిక ద్వారా 2,87,320 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అలాగే 143 గ్రామాలకు చెందిన 4.23 లక్షల మందికి తాగునీరందుతుంది.
2004-14 మధ్య 1006.71 కోట్లు నిర్మాణ పనులకు, రూ.400.62 కోట్లు భూసేకరణ, పునరావాసం కోసం ఖర్చు చేశారు.
2014-19 మధ్య నిర్మాణ పనులకు రూ.923.60 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి 193 కోట్లు ఖర్చు చేశారు.
2019-24 మధ్య జగన్ హయాంలో రూ.398 కోట్లు మాత్రమే ఇచ్చారు.
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఈ రెండేళ్లలో రూ1270 కోట్లు వ్యయం చేశారు.
తొలి దశలో ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు గోదావరి జలాలు 162 కిమీ ప్రయాణిస్తాయి.
మలి దశలో విశాఖకు నీరిచ్చే క్రమంలో మేఘాద్రిగెడ్డ వరకు 45 కిమీ మేర పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తారు.
అనకాపల్లి నుంచే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అడుగులు పడనున్నాయి. విశాఖకు.. అక్కడి నుంచి విజయనగరం జిల్లా గడిగెడ్డ వరకు 128 కిమీ మేర గోదావరి జలాలను తరలించడంతో ఈ పథకం పూర్తవుతుంది. రూ.17,050 కోట్ల వ్యయమవుతుందని తాజా అంచనా.
ఇవి కూడా చదవండి