డేటా సెంటర్లపై అపోహలు వద్దు
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:21 AM
విశాఖపట్నంలో డేటా సెంటర్లపై అపోహలు వద్దని, పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారమే వాటిని ఏర్పాటు చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు.
పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారమే ఏర్పాటు
విశాఖ అభివృద్ధికి ప్రాధాన్యం
ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
నగరంలో సుడిగాలి పర్యటన
ఆలిండియా రేడియో కూడలిలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో డేటా సెంటర్లపై అపోహలు వద్దని, పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారమే వాటిని ఏర్పాటు చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. ఆయన సోమవారం విశాఖలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత సిరిపురం ఆలిండియా రేడియో కూడలిలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వాల్తేరు క్లబ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య రాజకీయ ప్రయాణం, విలువలకు కట్టుబడిన విధానం నేటి యువతరానికి, ప్రజాప్రతినిధులకు ఎంతో ఆదర్శనీయమన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామన్నారు. ఆయన పేరుతో ఒక ఎక్స్‌పీరియన్సల్ మ్యూజియం ఏర్పాటుచేయాలని ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులకు సూచించారు. ఆ తరువాత ఆనందపురం మండలంలోని గంభీరం వెళ్లి డాక్టర్ ఆదినారాయణరావు ఉదారంగా ఇచ్చిన ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సామాజిక సేవా సంస్థల ‘ప్రేమోదయం’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు వేదాంత స్వామి ప్రభు పాదుకలకు పూలు సమర్పించి రాధా మదనమోహన్ స్వామిని దర్శించుకున్నారు. అక్షయ పాత్ర వంటశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. ఆహారంలో పోషక విలువల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ రాధాకృష్ణ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. నిష్ర్కించిన భక్తదాస నేతృత్వంలో డిజిటల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రేమ విద్యాలయ క్యాంపస్‌ను ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ సుంకరి శశికిరణ్, ఆదినారాయణ భార్య డాక్టర్ శశిప్రభలతో మాట్లాడి సేవా కార్యక్రమాలు తెలుసుకున్నారు. ఆ తరువాత పక్కనే స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ నిర్మించిన పాలియేటివ్, జర్రియేటివ్ కేర్ ఆస్పత్రిని ప్రారంభించారు. అక్కడ సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ, విశాఖపట్నం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలోనే నంబర్‌వన్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.