Share News

భవానీలపైకి దూసుకెళ్లిన కారు

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:28 AM

డ్రైవర్‌ నిద్రమత్తు నలుగురు భవానీ మాలధారుల ప్రాణాలు తీసింది. దీక్ష పూర్తిచేసుకుని దుర్గమ్మ దర్శనానికి బయల్దేరిన భవానీలు రోడ్డు దాటుతుండగా నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్‌ వారిని ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

భవానీలపైకి దూసుకెళ్లిన కారు

  • రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన స్కార్పియో

  • నలుగురు భవానీ మాలధారుల దుర్మరణం

  • కాకినాడ జిల్లా కత్తిపూడి హైవేపై దుర్ఘటన

శంఖవరం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): డ్రైవర్‌ నిద్రమత్తు నలుగురు భవానీ మాలధారుల ప్రాణాలు తీసింది. దీక్ష పూర్తిచేసుకుని దుర్గమ్మ దర్శనానికి బయల్దేరిన భవానీలు రోడ్డు దాటుతుండగా నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్‌ వారిని ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి 16 నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన భవానీ భక్తులు దీక్ష పూర్తి చేసుకుని విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం బుధవారం రాత్రి ప్రైవేటు బస్సులో బయల్దేరారు. గురువారం తెల్లవారుజామున సాంకేతిక లోపం తలెత్తడంతో కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు జంక్షన్‌ వద్ద బస్సును నిలివేసి మరమ్మతులు చేపట్టారు.

ఇంతలో రోడ్డుకు అటువైపు ఉన్న దుకాణంలో టీ తాగేందుకు వెళ్తున్న భవానీలను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి విజయవాడ వైపు వెళ్తున్న స్కార్పియో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరిగిడి యర్రయ్య (38), లింగాల సీతారాం (45), తాటిపూడి శివప్రసాద్‌ (40) అక్కడికక్కడే మృతిచెందగా... బోనేల రమణ సత్తిబాబు (40)ను ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో కారు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడు. దీంతో నలుగురు భవానీలను ఢీకొన్న తర్వాత ఆ కారు అదుపు తప్పి మరో లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తరలించారు.


ఉపముఖ్యమంత్రి పవన్‌ విచారం

కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ మాలధారులు మృతిచెందడం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. దీక్ష పూర్తి చేసుకుని దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తులు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 04:31 AM