సమన్వయంతో పనిచేయండి
ABN , Publish Date - Oct 23 , 2026 | 01:16 AM
దక్షిణ నియోజకవర్గంలో కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్ సూచించారు.
పరిస్థితులకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటు
దక్షిణ నియోజకవర్గ కూటమి నేతల సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
దక్షిణ నియోజకవర్గంలో కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్ సూచించారు. డాబాగార్డెన్స్‌లోని ఒక హోటల్‌లో గురువారం రాత్రి ఆ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 13 వార్డులను పరిస్థితులకు అనుగుణంగా కూటమి పార్టీల మధ్య సర్దుబాటు చేశామన్నారు. కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనని, వాటిని లోతుగా అర్థం చేసుకొని పరిష్కరించుకోవలసి ఉందన్నారు. ఎక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినా సామరస్యంగా ముందుకు వెళ్లాలన్నారు. అభ్యర్థులు స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వెళుతూ ప్రచారం నిర్వహించాలన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఎన్నికల పరిశీలకుడు షరీఫ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.
కూటమిదే విజయం
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రచార అస్త్రాలు
ఇన్‌చార్జి మంత్రి డోలా
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ధీమా వ్యక్తంచేశారు. గడచిన రెండున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను, విశాఖ నగరంలో చేసిన అభివృద్ధి పనులను అజెండాగా చేసుకుని ప్రచారం చేస్తామన్నారు. ఆయన గురువారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా విశాఖ అభివృద్ధికి చంద్రబాబునాయుడు అహరహం కృషిచేస్తున్నారన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను నగరానికి తీసుకురానున్నామన్నారు. మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ రిజర్వాయర్లలో నీటి నిల్వకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కొత్తగా మరో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. మేయర్ అభ్యర్థినిగా ముక్కా శ్రావణి ఎంపిక వ్యూహాత్మకమైందన్నారు. మేయర్‌తోపాటు 120 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. టెలీ కాన్ఫరెన్స్, విలేకరుల సమావేశంలో జిల్లా పరిశీలకుడు ఎంఏ షరీఫ్, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పట్టాభి పాల్గొన్నారు.
ఎన్నికలకు త్వరితగతిన ఏర్పాట్లు
అధికారులకు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశం
పోలింగ్ కేంద్రాలు, సామగ్రి పంపిణీ కేంద్రాలు పరిశీలన
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఆయన గురువారం జీవీఎంసీ అదనపు కమిషనర్ కె.రమేష్, ఇతర అధికారులతో కలిసి నార్త్‌జోన్ పరిధిలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. రిసెప్షన్ కేంద్రం, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు, ఆహార పంపిణీకి ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. స్ర్టాంగ్ రూమ్‌లు, మూడు వార్డుల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ రోజు విధులు నిర్వర్తించే అధికారులు, ఇతర సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని స్పష్టంచేశారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రితోపాటు సిబ్బంది సురక్షితంగా చేరుకునేలా రవాణా సదుపాయం ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం జ్ఞానానికేతన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో ఓటర్లకు అర్థమయ్యేలా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి గాజువాక వెళ్లి బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసుల వద్దకు వెళ్లి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను కలెక్టర్ అడిగితెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సామగ్రి పంపిణీ సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి, ఎస్‌ఈలు సంపత్‌కుమార్, రాయల్‌బాబు, పద్మావతి పాల్గొన్నారు.
బీసీలకు కూటమి పెద్దపీట
మేయర్ సీటు బీసీ మహిళకు..
120 వార్డుల్లో 92 (76.6 శాతం) కేటాయింపు
25మంది కాపు/తూర్పుకాపులకు 25
యాదవులకు 22...
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు కూటమి పార్టీలు పెద్దపీట వేశాయి. మొత్తం 120 వార్డుల్లో 92 బీసీలకు కేటాయించాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయస్థానాలు అనుమతించలేదు. అయినా అంతకు మించి బీసీలకు అవకాశం ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ ప్రకారమే జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ టికెట్‌ను బీసీ మహిళకు కేటాయించారు. ఇక 120 వార్డుల్లో తెలుగుదేశం 77, జనసేన 32, బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడు పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాయి. మొత్తం 120 వార్డుల్లో 92 (తెలుగుదేశం 58, జనసేన 27, బీజేపీ 7) వార్డులు (76.6 శాతం) బీసీలకు ఇచ్చాయి. సామాజిక వర్గాల పరంగా చూస్తే కాపు/తూర్పు కాపులకు 25, యాదవులకు 22, మిగిలినవి వెలమ, గవర, మత్స్యకార, కళింగ వర్గాలకు కేటాయించారు.