Share News

అప్పుల ఊబిలో యువత

ABN , Publish Date - Oct 23 , 2026 | 01:12 AM

...ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, ఆడంబరాలకు పోవడం, విలాసాలకు అలవాటుపడడం వల్ల యువకులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.

అప్పుల ఊబిలో యువత

  • ఆడంబరాలు, విలాసాల కోసమే...

  • ఈఎంఐల ఉచ్చులో కూరుకుపోతున్న వైనం

  • చిన్న వయసు నుంచీ ఆర్థిక క్రమశిక్షణ లేక అవస్థలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఫ రాజమండ్రికి చెందిన యువకుడు నగరంలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఏడాది కిందట ఖరీదైన బైక్‌ కొనిచ్చారు. ఆర్థిక అవసరాల కోసం కొద్దిరోజుల కిందట ఆ బైక్‌ను సగం ధరకు అమ్మేశాడు. అక్కడితో ఆగకుండా మరో రెండు లక్షల రూపాయల వరకూ అప్పులు చేశాడు.

ఫ నగర పరిధిలో ఎంవీపీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఆరంకెల జీతం. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ వద్ద రూ.20 లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ కొద్దిరోజుల కిందట కొందరు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అతను లేడు. ఈ విషయాన్ని భర్తను అడగ్గా మరో రూ.40 లక్షల వరకు అప్పులు ఉన్నట్టు చెప్పాడు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఉద్యోగం మానేసి, అందినచోటల్లా అప్పు చేసినట్టు తేలింది.

...ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, ఆడంబరాలకు పోవడం, విలాసాలకు అలవాటుపడడం వల్ల యువకులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అనవసరమైన వాటికి డబ్బులు వృథా చేస్తున్నారు. అందుకోసం అప్పులు చేస్తూ, వాటిని తీర్చే మార్గం లేక తమ దగ్గరున్న వస్తువులను అమ్మడం, కుదవబెట్టడం చేస్తున్నారు.

ఖర్చులకు అదుపే లేదు..

ఖరీదైన ఫోన్లు కొనుగోలు, ఎప్పటికప్పుడు షాపింగ్‌లు, బైక్‌లు, ఇతర వాహనాలు వినియోగించాలనే కోర్కె, ప్రేమ, ఇతర అనుబంధాల కోసం కొందరు యువకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అందుకోసం అప్పు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. గతంతో పోలిస్తే అప్పు పొందే మార్గాలు పెరగడం కూడా విచ్చలవిడితనానికి కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు అప్పు తీసుకోవాలంటే ష్యూరిటీలుండేవి. ఇప్పుడు... అనేక సంస్థలు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేస్తే చాలు అప్పులు ఇచ్చేస్తున్నాయి.

కుటుంబం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే సభ్యులందరిలో ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అయితే ఆదాయానికి మించి చేసే ఖర్చులు ఎన్నో జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎదుటివారిని చూసి పోల్చుకోవడంతోనే సమస్య ఎదురవుతోంది. సులభంగా రుణాలు లభిస్తున్నాయని దొరికినచోట అప్పు చేసి, ఆడంబరాలకు పోయి తీర్చలేక సతమతమవుతున్నారు. ఇటీవల కాలంలో పెద్దసంఖ్యలో యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

అప్పు చెల్లించేందుకు అప్పులు

కార్లు, ఖరీదైన బట్టలు, వాచ్‌లు, సెల్‌ఫోన్లు, టూర్లు, షికార్లు అంటూ కొందరు తమ స్థోమతకు మించి అప్పులు చేసి ఖర్చు చేస్తున్నారు. తొలిసారి చేసిన అప్పు తీర్చడానికి అవకాశం లేకపోతే మరింత ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి పాత అప్పు చెల్లిస్తున్నారు. దీంతో అప్పు తీర్చేందుకు మరో అప్పు అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. ఈ తరహా పరిస్థితి ఎక్కువగా 25 ఏళ్లు దాటి ఉద్యోగాలు చేస్తున్న యువతలో కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ చదువు తున్న విద్యార్థులు కూడా అప్పులు చేసి తల్లిదండ్రు లకు భారంగా మారుతున్నారు. పిల్లలు చేసిన అప్పుల గురించి తెలుసుకుని తల్లి దండ్రులు లబోదిబో మంటున్నారు.

ఆర్థిక క్రమశిక్షణ లోపించడమే..

ఈ తరహా ప్రవర్తనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. తమ ఆదాయం, ఖర్చులు వంటి లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా ఎవరినో చూసి, వారి మాదిరిగానే ఉండాలనే కోర్కె పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పు చేస్తున్న అవసరం, దానికి చెల్లించాల్సిన వడ్డీ, ఆదాయం, నెలవారీ వాయిదాలు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను బేరీజు వేసుకుంటే అప్పులు చేసే పరిస్థితి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.

పరిధికి మించిన కోర్కెలతో ఇబ్బందికర జీవితం

ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్భాటాల కోసం విచ్చలవిడి ఖర్చు చేస్తూ అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పు చేస్తున్నారు. ముఖ్యంగా యువత అపరిమితమైన కోర్కెలతో జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అప్పు తీర్చేందుకు కొందరు తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారు. చదువుతున్న పిల్లల ఖర్చులు, వారి స్నేహాలు, సోషల్‌ మీడియాలో పోస్టులు, ఇతర అంశాల ను తల్లిదండ్రులు నిశితంగా పరిశీలించాలి. చిన్న వయసులోనే పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి. సంపాదన, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని వివరించాలి. అప్పుడే యువత సాఫీగా జీవితాన్ని సాగించే వీలుంటుంది.

- డాక్టర్‌ విజయ భాస్కర్‌ బోనం, సీనియర్‌ సైకాలజిస్ట్‌

Updated Date - Oct 23 , 2026 | 01:12 AM