Share News

ఫైవ్‌ టర్మ్స్‌ .. అన్‌స్టాపబుల్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:26 AM

టీడీపీ కాంక్లేవ్‌లో ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. నాయకులకు స్థానిక, దేశ, ప్రపంచ రాజకీయాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఐదేళ్లకు ఒకసారి మారే ప్రజల ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా మారుతూ, వారికి దగ్గర కావాలని తెలిపారు. నాయకుడికి బ్యాక్‌ టీమ్‌ బలంగా ఉండటం చాలా ముఖ్యమంటూ తమ విజయ మంత్రం తెలియజేశారు.

ఫైవ్‌ టర్మ్స్‌ .. అన్‌స్టాపబుల్‌

అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కాంక్లేవ్‌లో ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. నాయకులకు స్థానిక, దేశ, ప్రపంచ రాజకీయాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఐదేళ్లకు ఒకసారి మారే ప్రజల ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా మారుతూ, వారికి దగ్గర కావాలని తెలిపారు. నాయకుడికి బ్యాక్‌ టీమ్‌ బలంగా ఉండటం చాలా ముఖ్యమంటూ తమ విజయ మంత్రం తెలియజేశారు.

నాయకుడు నిరంతర విద్యార్థిలా ఉండాలి

‘‘రాజకీయ నాయకుడు నిరంతర విద్యార్థిలా ఉండాలి. సమాజంలో మారుతున్న పోకడలను అధ్యయనం చేయాలి. నేను అలా ఉండబట్టే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల్లో నిలబడి గెలవగలుగుతున్నాను. పార్టీ కార్యాలయంలో ఇటీవల జరిగిన శిక్షణ కార్యక్రమాలకూ నేను హాజరయ్యాను. కొత్త తరం.. వారి ఆలోచనలు..అంచనాలు తెలుసుకోగలిగితేనే మనకు మనుగడ ఉంటుంది. నాయకులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందనే దానిపై కనీస అవగాహన ఉండాలి. అప్పుడే నియోజకవర్గంలో దానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు వేసుకోగలం.’’

- బుచ్చయ్య చౌదరి, ఏడో విడత ఎమ్మెల్యే

జనం మనచుట్టూ తిరగాలని అనుకుంటే అంతే

‘‘ప్రజలను మన చుట్టూ ఎప్పుడైతే తిప్పుకోవడం మొదలు పెట్టామో, అప్పుడే నాయకుడిగా మనం విఫలమైనట్టు. ఏదైనా పని కోసం మనవద్దకు వచ్చే వారికి...అయితే అవుతుందని... లేదంటే లేదని చెప్పాలే తప్ప వారిని పదే పదే తిప్పుకోవడం సరికాదు. దానివల్ల మన ఓటుబ్యాంకు పలచనవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏ నాయకుడికైనా బ్యాక్‌ ఆఫీస్‌ టీం బలంగా ఉండాలి. ప్రతి మండలం నుంచి 20 నుంచి 30 మంది మన తరఫున ప్రజల కోసం.. పార్టీ కోసం పనిచేసేలా చూసుకోవాలి. ప్రతి ఐదేళ్లకు ప్రజల ఆలోచనలు, విధానాలు మారుతుంటాయి. వాటికి అనుగుణంగా మనం అప్‌డేట్‌ కావాలి.’’

- గొట్టిపాటి రవికుమార్‌, ఐదో విడత ఎమ్మెల్యే


ప్రజలకు మనపై నమ్మకం ముఖ్యం

‘‘అభివృద్ధి చేస్తేనే గెలుస్తామనుకుంటే 1999-2004లో ఎంతో గొప్ప గా అభివృద్ధి చేశాం అయినా 2004 ఎన్నికల్లో ఓడిపోయాం. హైటెక్‌ సిటీ ఎక్కడ కట్టామో అక్కడే ఓడిపోయాం. పోనీ....డబ్బులతో గెలవగలం అనుకుంటే, ఇటీవల తమిళనాడులో విజయ్‌ చాలా తక్కువ ఖర్చుతో అధికారంలోకి వచ్చారు. ఇటీవల అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కలిస్తే.. ఎలక్షన్లో కంటిన్యూగా గెలవడానికి ఏమైనా ఫార్ములా ఉంటే చెప్పు అని అడిగా. ప్రజలతో కనెక్ట్‌ కావడమే గెలుపు మంత్రమని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి మనపై నమ్మకం పెంపొందించుకుంటే విజయం సాధిస్తాం. ఎవరికైనా అదే విజయమంత్రం.’’

- గంటా శ్రీనివాసరావు, ఐదో విడత ఎమ్మెల్యే

ఈ వార్తలనూ చదవండి

ప్లీజ్‌..! చిన్న విగ్రహాలు

లచ్చప్ప మాస్టారు..

Updated Date - Sep 08 , 2026 | 04:26 AM