Share News

గాఢ నిద్రలో ఉండగా మంటలు!

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:45 AM

అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి మంటలు రావడాన్ని ఓ ప్రయాణికురాలు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

గాఢ నిద్రలో ఉండగా మంటలు!

  • షార్ట్‌సర్క్యూట్‌తో ట్రావెల్‌ బస్సు దగ్ధం

  • ఆ సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు

  • ఒకరు గుర్తించడంతో తప్పిన పెను ప్రమాదం

పెద్దవడుగూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి మంటలు రావడాన్ని ఓ ప్రయాణికురాలు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా కాలిపోయినా ప్రాణాపాయం తప్పింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని మిడుతూరు గ్రామ సమీపాన 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఇంటర్‌సిటీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 33 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు గురువారం రాత్రి బయల్దేరింది. మిడుతూరు సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే బస్సు వెనుక భాగం నుంచి మంటలు రావడాన్ని బెంగళూరుకు చెందిన నేహ అనే ప్రయాణికురాలు గమనించారు. వెంటనే డ్రైవర్‌కు సమాచారమిచారు. డ్రైవర్‌ బస్సును పక్కన ఆపడంతో ప్రయాణికులు దిగేశారు. బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఒకరి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ కాలిపోయాయి. ఫైరింజన్‌ వచ్చి మంటలార్పివేసింది. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానానికి తరలించారు. షార్ట్‌ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సమాచారం అందినవెంటనే జిల్లా ఎస్పీ జగదీశ్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలను కూడా చదవండి

నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్

Updated Date - Sep 05 , 2026 | 04:45 AM