వానలు కురవాలి...పంటలు పండాలి
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:16 AM
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 30.84లక్షల హెక్టార్లకుగాను 22.82లక్షల హెక్టార్లలో సాగు పూర్తయ్యింది. సాధారణ విస్తీర్ణంలో ఇది 74శాతం కాగా, ఇప్పటివరకు సాగవ్వాల్సిన విస్తీర్ణంలో ఇది 81శాతం.
74శాతానికి చేరిన ఖరీఫ్ సాగు... ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం
రాష్ట్రవ్యాప్తంగా 54.6 శాతం వానలోటు
జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు
పంటలకు నీటి తడులపై రైతుల్లో ఆందోళన
తాజా వర్షాలతో ఆశాభావం
జలాశయాల్లోని నీరు, అడపా దడపా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. అయితే మండుతున్న ఎండలు, జలాశయాల్లో తగ్గిన నీరు, తీవ్ర ఎల్‌నినో పరిస్థితులతో వేసిన పంట చేతికొస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నెల రోజులపాటు కాస్తా కూస్తో నీటి తడులు అందితేనే పంట కళ్లజూస్తామన్న ఆశతో ఉన్నారు.
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 30.84లక్షల హెక్టార్లకుగాను 22.82లక్షల హెక్టార్లలో సాగు పూర్తయ్యింది. సాధారణ విస్తీర్ణంలో ఇది 74శాతం కాగా, ఇప్పటివరకు సాగవ్వాల్సిన విస్తీర్ణంలో ఇది 81శాతం. వరి, చిరుధాన్యాలు, అపరాలతో సహా 20.80లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాలు పండించాల్సి ఉండగా, ఇప్పటివరకు 16.60లక్షల హెక్టార్లు (80 శాతం) సాగులోకి వచ్చాయి. జూట్ 151శాతం, సోయాబిన్ 131శాతం, పెసలు 112శాతం, మినుము 109శాతం ఉండగా, అతి తక్కువగా పొగాకు 1శాతం, ఉలవ 8శాతం, జొన్న 21శాతం సాగులో ఉన్నాయి. ఎల్‌నినో నేపథ్యంలో ఇంత విస్తీర్ణంలో పంటల సాగవుతాయని వ్యవసాయ శాఖ కూడా అంచనా వేయలేదు. ఈ సీజన్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. వర్షాభావాన్ని తట్టుకునే స్వల్పకాలిక, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. అయినా రైతులు సంప్రదాయ వాణిజ్య పంటలు సాగు చేపట్టారు.
ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సరైన వర్షాలే కురవలేదు. జూన్1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 468 మిల్లీమీటర్ల వాన పడాల్సి ఉండగా, కేవలం 212.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దీంతో 54.6శాతం వర్షపాత లోటు కొనసాగుతోంది. 22 జిల్లాల్లో 20-59 శాతం, 6 జిల్లాల్లో 60-99శాతం లోటు ఉంది. బంగాళాఖాతంలో ఇంతవరకు ఏడెనిమిది అల్పపీడనాలు ఏర్పడి, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. భారీ, అతిభారీ వర్షాలు కురకపోయినా చెదురుమదురుగా పడుతున్న వర్షాలకు మెట్ట రైతులు పంటల సాగు చేశారు. మరోవైపు వరి సాగుకు జలాశయాల నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరినాట్లు వేశారు. కొన్నిచోట్ల బోర్లు కింద వరి సాగు చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు కాయ దశలో ఉండగా, పూత, పిందె దశలో పత్తి ఉంది. ప్రస్తుత వర్షాభావం నేపథ్యంలో మిరప సాగును రైతులు తగ్గిస్తున్నారు. ఏ పంటకైనా మరో నెల చెదురుమదురుగానైనా నీటి తడులు అందితేనే దిగుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు పంటలకు కొంత ఊపిరి పోస్తున్నాయి.
ఇప్పటిదాకా ఇలా...
నైరుతు సీజన్ మొదలైన తర్వాత 100 రోజుల్లో వర్షాలు పెద్దగా లేక మెట్ట పైర్లు ఎండుముఖం పట్టాయి. కొన్నిచోట్ల పంటలను చీడపీడలు చుట్టుముట్టాయి. ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చుతుండటంతో సాగునీటిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు నీరు ఇచ్చే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం తాగునీటికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి