Share News

ఐటీ కంపెనీ ఆటలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:07 AM

ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ కంపెనీలకు అతి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ, అనేక రాయితీలు ఇస్తుంటే వారు మౌలిక వసతుల కల్పనకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు.

ఐటీ కంపెనీ ఆటలు

పార్కింగ్‌కు స్థలం కేటాయించలేం

భవన నిర్మాణానికి అనుమతించండి

మినహాయింపు ఇవ్వాలని కోరిన ఓ కంపెనీ

శంకుస్థాపన జరిగి 11 నెలలైనా ముందుకు సాగని పనులు

రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ రుషికొండ హిల్‌-3పై 3.5 ఎకరాలు తీసుకున్న సంస్థ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ కంపెనీలకు అతి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ, అనేక రాయితీలు ఇస్తుంటే వారు మౌలిక వసతుల కల్పనకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు. కనీస వసతుల కల్పనలో మినహాయింపు ఇవ్వాలని ఒత్తిడి పెడుతున్నారు. ప్రభుత్వం వాటికి కూడా తలవంచితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఒక అతి పెద్ద ఐటీ కంపెనీకి రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నంబరు-3పై 3.6 ఎకరాలు కేటాయించింది. దానికి గత ఏడాది అక్టోబరు 21న మంత్రి చేతులు మీదుగా శంకుస్థాపన జరిగింది. అక్కడ ఎకరా భూమి విలువ రూ.40 కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం కోటి రూపాయల చొప్పునే ఇచ్చింది. ఆ సంస్థ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టి వేయి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకూ అక్కడ నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇటీవల ఇండస్ర్టియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ(ఐలా)కి భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసింది. తాము ఆ భవనంలో వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించలేమని, పార్కింగ్‌ నుంచి మినహాయింపు కావాలని కోరింది. ఈ పంచాయితీ ప్రభుత్వం వద్దకు చేరింది. దీనిపై ఏమి నిర్ణయిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

అదే రుషికొండ హిల్‌ నంబరు-3పై ప్రభుత్వం పదిహేనేళ్ల క్రితం స్టార్టప్‌ విలేజ్‌ పేరుతో ఐకానిక్‌ భవనం నిర్మించింది. అందులో 50 వేల చ.అ. ఆఫీసు స్థలం ఉంటే, మరో 50 వేల చ.అ. స్థలంలో పార్కింగ్‌ సదుపాయం కల్పించింది. ఆ పక్కనే మిలీనియం టవర్లు-1, 2లు నిర్మించారు. వాటిని కాండ్యుయెంట్‌, టీసీఎస్‌లకు కేటాయించారు. ఆ కంపెనీల ఉద్యోగులు తమ వాహనాలను అక్కడే పార్కింగ్‌ చేసుకుంటున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. రుషికొండ హిల్‌-2పై కూడా ప్రతి భవనంలో పార్కింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. ఎవరూ వాహనాలను రోడ్లపై పార్కింగ్‌ చేయడం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ ఐటీ కంపెనీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటే...ఆ సంస్థకు చెందిన వాహనాలన్నీ రోడ్లపైనే ఉంటాయి. అప్పుడు కొండపైనా ట్రాఫిక్‌ ఇబ్బందులు మొదలవుతాయి. ఇలాంటి సంప్రదాయానికి తెర తీయకుండా ప్రభుత్వం పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టంచేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వారికి ఇంకా అదనపు భూమి అవసరమైతే కేటాయించాలే తప్ప..పార్కింగ్‌ ఏర్పాట్లు లేకుండా ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చుకుంటే పోతే చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రభుత్వం రాయితీలు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు గానీ నిబంధనలు అతిక్రమించడానికి మాత్రం అనుమతులు ఇవ్వడం భావ్యం కాదని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Sep 13 , 2026 | 01:07 AM