Share News

చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:23 AM

పంట పొలంలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతిచెందింది. సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాపిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది.

చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

కల్లూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పంట పొలంలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతిచెందింది. సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాపిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. 2రోజుల క్రితం మండల సరిహద్దులోకి చేరుకున్న 13 ఏనుగుల మంద సోమవారం రాత్రి తెట్టుపల్లి వద్ద పంటలను ధ్వంసం చేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. పాపిరెడ్డిగారిపల్లి సమీపంలో రైతు భాస్కర్‌రెడ్డి మామిడితోటలో ఓ ఏనుగు మృతి చెంది ఉండటాన్ని ఓ మహిళ గుర్తించి గ్రామస్థులకు చెప్పారు.

వారిచ్చిన సమాచారంతో మంగళవారం ఎఫ్‌ఆర్వో థామస్‌ సుకుమార్‌, చిత్తూరు డీఎఫ్‌వో సుబ్బరాజు వచ్చారు. మామిడితోటలో స్టార్టర్‌ నుంచి బోరు మోటారు వరకు అమర్చిన విద్యుత్‌ వైర్లకు చిక్కుకొని ఏనుగు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అది 13 ఏళ్ల వయసున్న మగ ఏనుగని ఎఫ్‌ఆర్వో తెలిపారు. గుంపులోనిదా? ఒంటరిదా? మృతికి కారణాలేమిటన్నది బుధవారం ఉదయానికి తెలుస్తాయన్నారు. ఉన్నతాధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. పోస్టుమార్టం అనంతరం ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని నిర్దేశించారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 05:23 AM