Share News

జగన్‌ కేసుల్లో కదలికే లేదు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:30 AM

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోరింది.

జగన్‌ కేసుల్లో కదలికే లేదు

  • రోజువారీ విచారణకు ఆదేశాలు ఇవ్వండి

  • సీబీఐ ప్రత్యేక కోర్టును నిర్దేశించండి

  • పదేళ్లుగా పెండింగ్‌లోనే తొమ్మిది చార్జిషీట్లు

  • తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్‌

  • హరిరామజోగయ్య, ఇతర పిటిషన్లతో కలిపి ఈనెల 13న వింటామన్న న్యాయస్థానం

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోరింది. కాలం గడుస్తున్నప్పటికీ ఈ కేసుల్లో ఎలాంటి కదలికా లేదని పేర్కొంది. సీబీఐ కేసుల ఆధారంగా తాము దాఖలు చేసిన తొమ్మిది చార్జిషీట్లు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయంటూ తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. వాటిపై రోజువారీ విచారణ చేపట్టి వేగంగా పరిష్కరించేలా సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. జగన్‌ సహా నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు కొన్ని కంపెనీలు, వ్యక్తులు క్విడ్‌ ప్రోకో కింద జగన్‌ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి.

దీనిపై అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించడంతో,జగన్‌ సహా 73 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వాటి ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్‌, ఇందూ ప్రాజెక్ట్స్‌, ఇందూ టెక్‌జోన్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌, వాన్‌పిక్‌ పోర్ట్స్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, రాంకీ ఫార్మా సిటీ, ఇండియా సిమెంట్స్‌ తదితర కంపెనీలు, వ్యక్తులు భారీగా పెంచిన ధరలకు జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రా తదితర కంపెనీల్లో పెట్టినట్లు తేలిందని ఈడీ పేర్కొంది. 2016-2021 వరకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో తొమ్మిది కేసులు నమోదు చేశామని, ఈ కేసులను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌ తీసుకున్నప్పటికీ.. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం వల్ల విచారణ ముందుకు కదలడం లేదని ఈడీ తెలిపింది.


ఏళ్లు గడుస్తున్నా ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని.. సీబీఐ కోర్టు జడ్జీలు బదిలీ కావడం లేదా ఇతర కారణాలతో డిశ్చార్జి పిటిషన్లను ఇప్పటికీ డిసైడ్‌ చేయడం లేదని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల తీవ్రతను గుర్తించిన సుప్రీంకోర్టు.. జగన్‌కు సంబంధించిన ఓ అప్పీల్‌ కేసులో ‘ ఆర్థిక నేరాలను దేశ ఆర్థిక ఆరోగ్యానికే ముప్పుగా పరిగణించాలి.. ఈ కేసులను భిన్నమైన కోణంలో చూడాలి ’ అని వ్యాఖ్యానించిందని ఈడీ గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన వేగవంతమైన ట్రయల్‌ హక్కు కింద హైకోర్టును ఆశ్రయించినట్లు ఈడీ పేర్కొంది. జగన్‌కు సంబంధించిన కేసుల్లో వేగం పెంచి రోజువారీ విచారణ చేపట్టేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని..

ఈ కేసులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నాయంటేనే వాటిల్లో సహేతుకమైన పురోగతి లేదని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంది. ఈ కేసులకు సంబంధించి తదుపరి దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా.. ఈడీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల 7న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, జస్టిస్‌ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జగన్‌ కేసులను త్వరగా తేల్చాలని గతంలోనూ పలు పిటిషన్లు దాఖలైనట్లు హైకోర్టు గుర్తించింది. మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగంగా జరిగేలా పర్యవేక్షణ చేపట్టడానికి హైకోర్టు సుమోటోగా ఒక పిటిషన్‌ను నమోదు చేసింది.


సదరు పిటిషన్లపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. జగన్‌ కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని.. ఈ మేరకు నివేదిక సమర్పించాలని 2024లోనే సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీచేసినట్లు ఽతాజా విచారణలో దర్మాసనం గుర్తించింది. ఈ రెండు పిటిషన్లు తర్వాత విచారణకు లిస్ట్‌ కాలేదని.. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఆ రెండు పిటిషన్లతో జత చేయాలని ధర్మాసనం రిజిస్ర్టీకి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 03:30 AM