AP News: అన్నీ.. వరి పొట్టుతోనే...
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:32 AM
వరి పొలం మనకు అన్నాన్నే కాదు. తినడానికి ప్లేట్లు, తాగడానికి గ్లాసులు కూడా ఇస్తుంది. అడుగడుగునా ప్లాస్టిక్ భూతం భయపెడుతోంటే... పర్యావరణ హితమైన ఉత్పత్తులను తయారుచేస్తోంది ‘అగ్రీవేర్’ సంస్థ. ఆ విశేషాలే ఇవి...
ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలిసిపోకుండా... ఏళ్లతరబడి ఉండిపోయి, నేల సారాన్ని తగ్గిస్తాయి. క్రమంగా మైక్రోప్లాస్టిక్‌గా మారి నీటి వనరులు కలుషితం అవుతాయి. దానివల్ల భూమిలో పెరిగే సూక్ష్మజీవులు అంతరించి పోతే, పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుంది. ‘అలాగే ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తీసుకోవడం వల్ల విషరసాయనాలు ఆహారంలో కలుస్తాయి. అవి శరీరంలోని హార్మోన్ వ్యవస్థను దెబ్బతీసి... పిల్లలు, మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. జీర్ణకోశ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడంతో క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది’ అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసినా, వాటి వాడకం పెరుగుతూనే ఉంది. కుప్పలుతెప్పలుగా వస్తున్న ప్లాస్టిక్ విస్తర్లతో పర్యావరణానికి కీడు తప్పడం లేదు. దీనికి విరుగుడుగా ఒక కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది ‘అగ్రీవేర్’ బృందం.
పొలాల్లో పుట్టిన ఆలోచన ...
‘‘సౌకర్యం పేరుతో ప్లాస్టిక్ ప్లేట్లు, చెంచాలు, కప్పులు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. క్రమక్రమంగా వాటి వాడకం ఎక్కువై పోవడంవల్ల, మన ఆరోగ్యానికే ప్రమాద భరితంగా మారుతున్నాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల ఏర్పడే మైక్రోప్లాస్టిక్ రేణువులు... ఆహారం ద్వారా కడుపులోకి చేరి, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ ప్రమాదం నుంచి వినియోగదారులను కాపాడడానికి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఏంటీ? అనే మా ఆలోచనకు పొలాల్లో పుట్టిన సమాధానం... ‘వరి పొట్టు ప్లేట్లు’. ఒకప్పుడు ధాన్యపు మిల్లుల దగ్గర వృథాగా పారేసే వరి పొట్టు నుంచి ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తున్నాం’’ అంటున్నారు ‘అగ్రీవేర్’ ప్రతినిధులు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పల్నాడు జిల్లా, నరసరావుపేట సమీపంలోని కాకాని గ్రామవాసి రాజ్యలక్ష్మి ఎమ్.సి.ఎ చదివారు. పదిమందికి ఉపాధితో పాటు పర్యావరణహితమైన పరిశ్రమ పెట్టాలనే ఆలోచనతో... మరో ఇద్దరితో కలిసి వ్యవసాయ వ్యర్థాలతో ప్రయోగాలు చేశారు. వరి పొట్టుతో అన్నం ప్లేట్లు, గ్లాసులు, స్పూన్ల తయారీకి యూనిట్ ఏర్పాటు చేయాల నుకున్నారు. వారికి ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ర్టియల్ రీసెర్చ్’ సంస్థ సాంకేతిక సహకారం అందించింది. అలా ‘బయో డి గ్రేడబుల్’ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించారు.

ఒక ప్లేట్ తయారీకి...
సాధారణంగా 12 అంగుళాల ఒక ప్లేట్ తయారీకి 100 గ్రాముల పొట్టు అవసరం అవుతుంది. సైజు మోడల్‌ని బట్టి పొట్టు అవసరం ఉంటుంది. వీటి తయారీలో రసాయన గ్లూలు కాకుండా, కర్రపెండలం పిండి, బియ్యపు పిండి గమ్‌లను ఉపయోగిస్తున్నారు. అందుకే వీటిని వాడిన తరువాత త్వరగా మట్టిలో కలిసిపోతాయి. ‘‘వరి పొట్టు ప్లేట్లతో పాటు ప్లాస్టిక్ రహితంగా విస్తరాకులు కూడా తయారు చేస్తున్నాం. రసాయన గమ్‌లు, పేపర్ బోర్డులు వాడకుండా పూర్తిగా సహజ పద్ధతులతో తయారు చేస్తున్నాం’’ అంటారామె.
ధాన్యం మర పట్టినపుడు వచ్చే పొట్టు, తవుడు ఈ పరిశ్రమకు ముఖ్యమైన ముడి సరుకు. వీటిని ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయడం ద్వారా బయో డి గ్రేడబుల్ ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తున్నారు. ఈ ఉత్పతుల ప్రత్యేకత ఏంటంటే... వాటిని ఒక్కసారి వాడి పారేస్తే కొన్ని వారాల్లోనే మట్టిలో కలిసిపోతాయి. పెరటి మొక్కలకు ఎరువుగా కూడా వాడవచ్చు. పర్యావరణానికి హాని లేకుండా భూమిలోనే పోషకాలుగా మారిపోతాయి. ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యం, అనారోగ్యాలకు ఇదొక సుస్థిర పరిష్కారం.
‘‘ఈ పర్యావరణహిత ప్రాజెక్ట్‌ని ఎవరైనా చేపట్టవచ్చు. పొదుపు సంఘాల మహిళలకు ఎంతో ఉపయుక్తం. యంత్ర పరికరాల ఏర్పాటుకు రూ.50 నుంచి 60 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ రంగంలో విజయం సాధించాలంటే ఆసక్తి సహనం, ఓర్పు చాలా అవసరం’’ అన్నారు రాజ్యలక్ష్మి.
వృథాగా పారేేస వ్యవసాయ అవశేషాలే
ఈ రోజు పర్యావరణానికి మిత్రులుగా మారుతున్నాయి. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం మన పొలాల్లోనే ఉందని, వరిపంట మనకు అన్నమే కాదు, దానిని తినడానికి ప్లేటును కూడా ఇస్తుందని ఈ ఆవిష్కరణ ద్వారా నిరూపించిన వీరి ప్రయత్నం భవిష్యత్తుకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది కదూ.
- శ్యాంమోహన్, 94405 95858
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..
శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక
Read Latest Telangana News and National News