Share News

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:57 PM

2026 బడ్జెట్‌లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో తాగునీటి అవసరాల కోసం రూ.840 కోట్లు కేటాయించారన్నారు.

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు
Union Minister Rammohan Naidu

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7: కేంద్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ 2026-27పై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ కాదని, రాజకీయాలు పక్కనపెట్టి 140 కోట్ల మంది భారతీయుల కోసం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 2014కు ముందు ప్రపంచంలో అత్యంత బలహీన దేశాల్లో భారత్ ఒకటిగా ఉండేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. 7 శాతం వృద్ధి రేటు సాధించేందుకు తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టారని అన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ఏపీకి కేంద్రం సహకరిస్తుందని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని.. ప్రపంచ దేశాలు భారత్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు.


గతంలో దేశవ్యాప్తంగా 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 164కు పెంచామని కేంద్రమంత్రి చెప్పారు. విమానాల తయారీకి బడ్జెట్‌లో అవకాశాలు కల్పించామని తెలిపారు. ఏపీలో తాగునీటి అవసరాల కోసం రూ.840కోట్లు కేటాయించారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రూ.13 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఎకరాల భూమి కేటాయించిందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి చెప్పారు. 2026 బడ్జెట్‌లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయన్నారు. ఏపీలో నూతన రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.10,134 కోట్లు ప్రకటించారని, అమరావతి కోసం రూ.1,120 కోట్లు కేటాయించారని వివరించారు. అమరావతిలో ఇప్పుడు 24 గంటలూ పనులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు.


కేంద్ర సహకారంతోనే గత 20 నెలల్లో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈ విజయాలు మరో 20 సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ‘పండ్లు కాసే సమయంలో కసాయి వాడికి అప్పగించవద్దు’ అని అన్నారు. రాష్ట్రానికి బలమైన పునాదులు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రాజధాని అంటే చెప్పుకోలేకపోయామన్నారు రామ్మోహన్ నాయుడు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.13 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఇటీవల జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ తొలిసారిగా రూ.52కోట్ల లాభాలు సాధించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 06:03 PM