Share News

అటవీ శాఖ భారీ రెస్క్యూ.. ఆపరేషన్ టైగర్ విజయవంతం..

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:45 PM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం పరిసర ప్రాంతాల్లో కొన్నిరోజులుగా పులి సంచారం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పులిని బంధించేందుకు అటవీ అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

అటవీ శాఖ భారీ రెస్క్యూ.. ఆపరేషన్ టైగర్ విజయవంతం..
Operation Tiger

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తూ.గో.జిల్లాలో కొన్ని రోజులుగా హడలెత్తిస్తున్న పెద్దపులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం కృష్ణయ్య కాలనీ సమీప పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆరు రోజులుగా పులి దాడుల్లో పశువులు మృతిచెందడంతో, ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ ‘ఆపరేషన్ టైగర్’ని చేపట్టారు. మొత్తానికి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి పులిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.


నాలుగు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి పులిని సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పులి స్పృహ కోల్పోయిందని.. బోన్లో సురక్షితంగా బంధించి విశాఖకు తరలించినట్లు చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి నేతృత్వంలో నిర్వహించారు. అనుభవజ్ఞులైన సిబ్బంది.. పొలాలు, అటవీ ప్రాంతాలు, పశువులపై దాడులు జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టి పులి ఆచూకీ కనుగొన్నారు. పూణే నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందం రాజమహేంద్రవరానికి చేరుకుని ‘ఆపరేషన్ టైగర్’ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. 17 రోజుల తర్వాత పులిని సురక్షితంగా బంధించడంతో స్థానికులు, అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 07:56 PM