ప్రియాంక కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు: ఎస్పీ
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:12 PM
రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు.
రాజమండ్రి, ఆగస్టు 09: నగరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రియాంక ఆరోగ్యంపై ఆమె తండ్రితో పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నిందితులిద్దరూ ప్రసాద్ ఆదిత్య మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే క్రమంలో కారును నిర్లక్ష్యంగా నడిపారని పేర్కొన్నారు.
స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను వారు కారుతో బలంగా ఢీ కొట్టారని ఎస్పీ వివరించారు. వరుసగా మూడు సార్లు స్కూటీని ఢీ కొట్టడంతో.. ప్రియాంక తీవ్రంగా గాయపడిందని అన్నారు. అనంతరం నిందితులు దొరక్కుండా పారిపోయారని చెప్పారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి ఈ ప్రమాదంపై తమకు సమాచారం వచ్చిందని వివరించారు. ఆ రోజు రాత్రే ప్రియాంక స్నేహితుడు వెంకట దుర్గ సాయి స్టేట్‌మెంట్ తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు.
నిందితులిద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారు మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు ఆధారాలు కూడా సేకరించామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సోమవారం కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈ కేసులో పోలీసులపై ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్
ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదు: టీపీసీసీ చీఫ్
For More AP News And Telugu News