Share News

ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేస్తాం: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:48 PM

ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమన్నారు.

ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేస్తాం: మంత్రి నిమ్మల
Minister Nimmala Ramana Naidu

కాకినాడ జిల్లా: ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమన్నారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు నీటి సమస్య లేకుండా గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.


కాకినాడ జిల్లా అన్నవరంలో పంపా ఆక్విడక్ట్ వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఆరెంపూడి, గవరయ్య కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులనూ మంత్రి నిమ్మల పర్యవేక్షించారు. అనంతరం తుని ఆర్ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌లో పోలవరం ఎల్‌ఎంసీ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.


నేష‌న‌ల్ హైవేల‌ క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పనులు ఆలస్యం చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులు, ఏజెన్సీలను మంత్రి సున్నితంగా హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు కీలకమన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించడానికి పోలవరం ఎడమ ప్రధాన కాలువే ఆధారమన్నారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు నీటి సమస్య లేకుండా ఈ నీటిని అందిస్తామన్నారు.


ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం ఎడ‌మ కాలువ‌ కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను ప్రీ క్లోజర్ చేసి ఉత్తరాంధ్ర ప్రజలపై జగన్ గత ప్రభుత్వం కక్ష్య కట్టిందని మండిపడ్డారు. పోలవరం ఎడమ కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 8,122 క్యూసెక్కులకు తగ్గిస్తూ ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు నాడు జగన్ గండికొట్టారని మంత్రి నిమ్మల ఆగ్రహించారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మొదటి ప్రాధాన్యతగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తే, రెండో ప్రాధాన్యతగా లెఫ్ట్ కెనాల్ పనులను పరిశీలించారని చెప్పారు.


కూటమి ప్రభుత్వం రూ.1,460 కోట్లు ఖ‌ర్చు చేసి జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకెళ్లేలా పనులు పూర్తి చేస్తున్నట్లు మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఇప్పటివరకూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 76 శాతం పూర్తి చేశామన్నారు. కుమ్మరిలోవలోని 472 కుటుంబాలకు తమ ప్రభుత్వం రూ.30.38 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ మొద‌టి నుంచి తుని వ‌ర‌కు ఉన్న 110 మైన‌ర్ ఇరిగేష‌న్ ట్యాంకులు నిండి 28,557 ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.


పిఠాపురం అప్ టేక్ స్లూయిస్ నిర్మాణం పూర్తయితే 67,674 ఎక‌రాల ఏలేరు ఆయ‌క‌ట్టు స్థిరీకరణ జరుగుతుందని నిమ్మల తెలిపారు. ఎడ‌మ ప్రధాన కాలువ ప్రవహించే మార్గమధ్యంలో ఉన్న 143 గ్రామాల‌కు చెందిన 5.23 లక్షల మంది జ‌నాభాకు తాగునీటి సౌక‌ర్యం లభిస్తుందన్నారు. పాయ‌కారావుపేట‌కి ఎగువ‌న ఉన్న 98 మైన‌ర్ ఇరిగేష‌న్ ట్యాంకులు నిండ‌టం ద్వారా 48,368 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నీరందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్‌తో అధికారుల చర్చలు

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Updated Date - Apr 25 , 2026 | 02:04 PM