Irussumanda Blowout: బ్లోఅవుట్ క్యాపింగ్‌కు మరో వారం పడుతుంది: జిల్లా కలెక్టర్
ABN , Publish Date - Jan 06 , 2026 | 08:04 PM
ఇరుసుమండ బ్లోఅట్‌కు క్యాపింగ్ చేయటానికి మరో వారం రోజుల సమయం పడుతుందని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మంటల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని ఆయన చెప్పారు.
అమలాపురం, జనవరి 06: ఇరుసుమండ బ్లోఅవుట్‌లో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఓఎన్‌జీసీ సిబ్బందితో పాటు జిల్లా అధికారులు నిరంతరాయంగా పని చేస్తున్నారు. అయినా అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఇరుసుమండ బ్లోఅవుట్‌కు క్యాపింగ్ చేయటానికి మరో వారం రోజుల సమయం పడుతుందన్నారు. అయితే.. ఈ మంటల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం వాటిల్లలేదని ఆయన చెప్పారు. సుమారు 80 నుంచి 100 కొబ్బరి చెట్లు, 2 ఎకరాల పంట భూమికి నష్టం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ధ్వంసమైన కొబ్బరి చెట్లు, దెబ్బతిన్న పంటలతోపాటు ఆ సమీపంలోని పంట పొలాలకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. గ్యాస్ స్ప్రెడ్ అయి ఉంటే మరింత ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు. మంటవల్ల ఆ ప్రమాదం తప్పిందని చెప్పారు. బ్లోఅవుట్ ఒకేసారి కాకుండా క్రమేపి తగ్గించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. ఐదు వైపులా పైపులతో వాటర్ అంబ్రెల్లా కొనసాగుతుందని చెప్పారు. పూర్తిస్థాయిలో బ్లోఅవుట్ అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక.. ఓఎన్‌జీసీ టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా మాట్లాడుతూ.. బ్లోఅవుట్ సంభవించిన మోరి-5 వెల్‌ను డీప్ ఇండస్ట్రీకి 15 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చామని వివరించారు. ఈ డీప్ ఇండస్ట్రీ లిస్టెడ్ కంపెనీ అని గుర్తుచేశారు. క్యాపింగ్ అండ్ కేసింగ్ చేయడానికి వారం రోజులు పడుతుందని చెప్పారు. బ్లోఅవుట్ వల్ల ఎలాంటి సమస్య తలెత్తదని విక్రమ్ సక్సేనా చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరుసుమండ బ్లోఔట్.. ఓఎన్‌జీసీ కీలక ప్రకటన..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్ణయాలు
Read Latest AP News And Telugu News