అప్పు ఉరితాడైంది!
ABN , Publish Date - Sep 07 , 2026 | 04:57 AM
ఒకవైపు ఓ మహిళ రాసిన సూసైడ్ నోట్‌తో పోలీసు కేసు...మరోవైపు చిట్టీల వ్యవహారంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు దంపతుల ప్రాణాలు తీశాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో కర్రి వెంకట నాగేశ్వరరెడ్డి (49), కర్రి దుర్గాలక్ష్మి (42) దంపతులు నివాసం ఉంటున్నారు.
ఆర్థిక సమస్యలకు తోడు మెడకు చుట్టుకున్న సూసైడ్ నోట్ కేసు
మనస్తాపంతో దంపతుల బలవన్మరణం
కోనసీమ జిల్లా రావులపాలెంలో ఘటన
రావులపాలెం సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఓ మహిళ రాసిన సూసైడ్ నోట్‌తో పోలీసు కేసు...మరోవైపు చిట్టీల వ్యవహారంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు దంపతుల ప్రాణాలు తీశాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో కర్రి వెంకట నాగేశ్వరరెడ్డి (49), కర్రి దుర్గాలక్ష్మి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు, ఏడోతరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. నాగేశ్వరరెడ్డి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, దుర్గాలక్ష్మి కాలనీలోని కొంతమంది మహిళలతో కలిసి గత కొన్నేళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తున్నారు. దుర్గాలక్ష్మి కాలనీకి చెందిన ఒక మహిళ ద్వారా సుమారు రూ.1.30 కోట్లు వేరొకరికి అప్పు ఇవ్వగా తిరిగి చెల్లించడంలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇటీవల పాటదారులు తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, అదే కాలనీకి చెందిన కొప్పిశెట్టి నాగమల్లేశ్వరి...తాను రూ.15 లక్షలు దుర్గాలక్ష్మి ఇవ్వగా తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గత నెల 31వ తేదీన సూసైడ్‌నోట్ రాసి చనిపోయింది. దీంతో పోలీసులు దుర్గాలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితులను తట్టుకోలేకపోయిన దుర్గాలక్ష్మి ఆదివారం సూసైడ్‌నోట్ రాసి భర్తతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ నుంచి రూ.1.3 కోట్లు అప్పు ఇప్పించిన మహిళ తిరిగి చెల్లించడానికి నిరాకరించడం, తనపై కేసు నమోదు కావడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో పేర్కొంది. ఆమె నుంచి సొమ్ములు వసూలు చేసి పాటదారులకు చెల్లించాలని కోరింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుర్గాలక్ష్మి చెల్లెలు విజయ ఫిర్యాదు మేరకు సీఐ జి.రమే్‌షబాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్