Share News

అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:31 PM

జీకే వీధి మండలం సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది.

అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి
గోతులమయంగా సీలేరు- పాలగెడ్డ రహదారి

సీలేరు నుంచి పాలగెడ్డ వరకు అడుగడుగునా గోతులు

ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు

పట్టించుకోని అధికారులు

సీలేరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కలిపే ఈ రహదారి దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు సైతం పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఈ రహదారిలో నిత్యం ప్రయాణించే వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.

జీకే వీధి మండలం లోని సీలేరు నుంచి భద్రాచలం, విజయవాడ, రాజమహేంద్రవరానికి ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఈ రోడ్డు మీదుగానే వెళుతుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు ప్రస్తుతం దారుణంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు నిలిచిపోయి ఏది రోడ్డో?, ఏది గొయ్యో? తెలియక వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. 1960లో సీలేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం సింగిల్‌ రోడ్డు నిర్మించారు. అప్పటి నుంచి ఈ రహదారి విస్తరణకు నోచుకోలేదు. దీనికి తోడు గత పన్నెండేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 20 కిలోమీటర్ల రహదారి గజానికో గొయ్యి చొప్పున దారుణంగా ఉంది. బెంగాలీ క్యాంప్‌, మంగంపాడు మధ్య రహదారి చెరువును తలపిస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి గత ఏడాది టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆర్వీనగర్‌ నుంచి నూతిబంధ వరకు మాత్రమే నిర్మించి, రెయిన్‌గేజ్‌ నుంచి ధారకొండ, సీలేరు నుంచి పాలగెడ్డ రెండు రీచ్‌ల్లో పనులు చేయకుండా వదిలేశారు. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేసి వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. రహదారి నిర్మాణం చేపట్టేంత వరకైనా గోతులను పూడ్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:31 PM