Share News

స్లాట్‌ బుకింగ్‌తోనే పత్తి కొనుగోళ్లు

ABN , Publish Date - Sep 09 , 2026 | 06:26 AM

ఇకపై సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు, ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

స్లాట్‌ బుకింగ్‌తోనే పత్తి కొనుగోళ్లు

  • కపాస్‌ కిసాన్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలి

  • ఆధార్‌ అనుసంధాన బ్యాంకు ఖాతాకే చెల్లింపులు

  • సీసీఐ పత్తి కొనుగోళ్లకు మార్గదర్శకాలు జారీ

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇకపై సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు, ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రానున్న కాలంలో రాష్ట్రంలో సీసీఐ గుర్తించిన, మార్కెటింగ్‌ శాఖ సిఫారసు చేసిన మార్కెట్‌ యార్డులు, జాయింట్‌ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్‌ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు చేస్తారు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలుకు జిన్నింగ్‌ మిల్లుల్లో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలు, సీఎంయాప్‌, ప్రభుత్వ శాఖల యాప్‌లను వినియోగిస్తారు. ఆధార్‌, ఈ-క్రాప్‌ ఆధారంగా రైతులను గుర్తిస్తారు. పత్తి కొనుగోలుకు ప్రతి రోజూ సాయంత్రం 5గంటల వరకు చివరి అంచనా సమయంగా ఉంటుంది. పత్తి అమ్మకాలకు కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ-క్రాప్‌లో నమోదైన సాగు విస్తీర్ణం ప్రకారం పరిమాణాన్ని లెక్కించడానికి మండలాల వారీగా కోత, ఉత్పత్తి వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బంది కపాస్‌ కిసాన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. పత్తి బోరాలకు రైతులు గోనె సంచులు, ప్లాస్టిక్‌ సంచులు వాడకుండా లూజుగా ఉన్న పత్తినే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావా లి. పత్తి సేకరణకు రైతు కుటుంబ సభ్యులను గుర్తించడానికి రేషన్‌కార్డుల డేటాను కపాస్‌ కిసాన్‌ యాప్‌, సీసీఐ మాడ్యూల్‌కు అనుసంధానం చేయాలి.


స్లాట్‌ బుకింగ్‌ కోసం, కొనుగోలు కేంద్రాలలో పత్తి అమ్మకానికి రైతులు ఆధార్‌, పట్టాదార్‌ పాసుపుస్తకం నకళ్లను రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వాలి. సాగు విస్తీర్ణం, మండలాల వారీగా హెక్టారు కు దిగుబడి, కోతల వారీ ఉత్పత్తిని గుర్తించి, పత్తి విక్రయాలకు సీసీఐ అనుమతి ఇస్తుంది. సీసీఐ ద్వారా రైతుకు ఆధార్‌ అనుసంధాన బ్యాం కు ఖాతాకే ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుగుతాయి. జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీటీవీల విశ్లేషణకు హైకోర్టు ఆదేశాల మేరకు సీసీఐ అవసరమైన చర్య లు తీసుకోవాలి. గతంలో పత్తి సేకరణలో స్లాట్‌ బుకింగ్‌, జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌1,2,3 పద్ధతిలో తెరవడంలో తలెత్తిన ఇతర సమస్యలతోపాటు, గుంటూరు, కర్నూలులో మరిన్ని మిల్లులు ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సీసీఐ తగిన చర్యలు తీసుకోవాలి. కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్ల పర్యవేక్షణకు జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి.

ఈ వార్తలనూ చదవండి...

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’

Updated Date - Sep 09 , 2026 | 06:26 AM