Share News

హ్యాండిల్‌ వదిలే..య్‌!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:17 AM

వేగంగా కదులుతున్న రైలును ఎక్కబోయి, పట్టుతప్పి తలుపులకు వేలాడుతున్న ప్రయాణికుడిని ఓ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో రక్షించారు.

హ్యాండిల్‌ వదిలే..య్‌!

కదిలే రైలుకు వేలాడిన ప్రయాణికుడు.. కాపాడిన కానిస్టేబుల్‌ సురేంద్ర

‘అనంత’లో ఆలస్యంగా వెలుగులోకి..

కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

అనంతపురం క్రైం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): వేగంగా కదులుతున్న రైలును ఎక్కబోయి, పట్టుతప్పి తలుపులకు వేలాడుతున్న ప్రయాణికుడిని ఓ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో రక్షించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో గత నెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగింది. అనంతపురం నగరంలోని భైరవనగర్‌కు చెందిన రవికుమార్‌(49) కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒక చేత్తో తలుపు హ్యాండిల్‌ పట్టుకుని ఎక్కే సమయంలో పట్టుతప్పి, వేలాడాడు. అదే సమయంలో మరో పనిమీద రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారంపై ఉన్న అనంతపురం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ సురేంద్ర క్షణాల్లో స్పందించారు. ప్రయాణికుడి వైపు శరవేగంగా దూసుకెళ్లి అతడి షర్ట్‌ కాలర్‌ను పట్టుకున్నారు. ‘హ్యాండిల్‌ వదిలెయ్‌’ అని బిగ్గరగా అరుస్తూ, రవికుమార్‌ను ప్లాట్‌ఫారంపైకి బలంగా లాగారు. దీంతో అతడికి పెద్ద ప్రమాదం తప్పింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ షాక్‌ నుంచి తేరుకున్న రవికుమార్‌, వెంటనే కానిస్టేబుల్‌ సురేంద్ర కాళ్లమీద పడ్డాడు. ‘మీరు నా ప్రాణం కాపాడిన దేవుడు సర్‌’ అని కృతజ్ఞతలు తెలిపారు. అక్కడే ఉన్న పలువురు ప్రయాణికులు కానిస్టేబుల్‌ను అభినందించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీశ్‌.. కానిస్టేబుల్‌ సురేంద్రను శనివారం తన చాంబర్‌కు పిలిపించి అభినందించారు. శాలువ కప్పి సన్మానించారు. సురేంద్ర చొరవ పోలీసు శాఖకు గర్వకారణమని ఎస్పీ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 05:17 AM