Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:15 PM
చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
- ముడుచుకుపోతున్న మల్బరీ ఆకు
- గూళ్లు అల్లని పట్టుపురుగులు
మడకశిర(అనంతపురం): రోజురోజుకు చలి పెరిగిపోతుండడంతో పట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వేసవిలో వంద గుడ్ల పెంపకంతో 100 కిలోలకు పైగా పట్టుగూళ్ల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం చలి అధికం కావడంతో 50 నుంచి 60 కిలోల లోపే దిగుబడి వస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుపరిశ్రమ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా మల్బరీ తోటలు సాగుచేస్తుండేవారు.
ప్రస్తుతం ఏడువేల ఎకరాల లోపే సాగుచేస్తున్నారు. చలికి మల్బరీ పంట ఎదగడంలేదు. ఆకులు ముడుచుపోవడంతో పట్టుపురుగులు సరిగా తినడంలేదు. దీంతో గూళ్లు అరకొరగా అల్లుతున్నాయని రైతులు వాపోతున్నారు. పట్టు పురుగులకు సున్నంకట్లు రోగం సోకి దిగుబడి పడిపోతోందని రైతులు చెబుతున్నారు.
రైతులు మెలకువలు పాటించాలి
చలికాలంలో పట్టుపురుగులు పెంపకంలో రైతులు తప్పనిసరిగా మెలకువలు పాటించాలి. పట్టుపురుగులు షెడ్లలో ఉన్న సమయంలో చలికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సున్నంకట్టు రోగం వస్తుంది. షెడ్లలో చలి సోకకుండా ప్లాస్టిక్ పేపర్ కాకుండా ఉష్ణోగ్రతలు పెంపకం కోసం గోనె సంచులు వేసుకోవాలి. మల్బరీ తోటల్లో ఆకులు ముడతలు పడకుండా సెరిపోషణ్ 7 ఎంఎల్, షాద్ 3 గ్రాముల మందును కలిపి మల్బరీ ఆకు కోసిన 15 రోజులకు ఒక్కసారి పిచికారి చేయాలి.
-హనుమంతనాయక్, సెరికల్చర్ ఏడీ, మడకశిర
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News