మీ ఆటలు సాగనివ్వం
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో వైసీపీ ఆటలు సాగనీయబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘‘నంద్యాలలో వైఎస్ విగ్రహంపై వైసీపీ వాళ్లే దాడిచేసి సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు.
గొడ్డలి పార్టీ జీవితమంతా నాటకమే
నంద్యాలలో వైఎస్ విగ్రహ ధ్వంసంతో రాజకీయం
క్షణాల్లో నిందితుడిని పట్టుకున్నాం.. అతడు వైసీపీ కార్యకర్త
ఆ విషయం జగన్ మీడియా ఎందుకు రాయలేదు?
కూటమి ప్రభుత్వ అభివృద్ధితో వైసీపీలో ఫ్రస్ట్రేషన్
ఒక్క జాబ్ క్యాలెండరూ అమలుచేయని వైసీపీ
మేం మెగా డీఎస్సీ ఇస్తే, దానిపై నానా యాగీ
23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆగస్టు 15 నుంచి సంజీవని పథకం అమలు..
తుని ‘పేదలసేవలో..’ సభలో చంద్రబాబు వెల్లడి
‘‘పింఛను డబ్బులు ఇంటింటికీ వెళ్లి స్వయంగా ఇస్తే ఆ ఆనందం వేరు. నేను కూడా బటన్ నొక్కి పింఛను డబ్బులు ఇవ్వొచ్చు. బటన్ నొక్కితే ఆనందం ఉండదు. పైశాచిక ఆనందమే ఉంటుంది. పింఛను డబ్బులు పేదలు వరుసగా రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా కలిపి ఇస్తున్నాం. ఈనెల లేదంటే వచ్చే నెలలో ‘తల్లికి వందనం’ డబ్బులు జమ చేస్తాం.’’
- చంద్రబాబు
కాకినాడ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ ఆటలు సాగనీయబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘‘నంద్యాలలో వైఎస్ విగ్రహంపై వైసీపీ వాళ్లే దాడిచేసి సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు. కానీ, క్షణాల్లోనే దొరికిపోయారు. ఆ ఘటనలో నిందితుడిని పట్టుకుంటే జగన్ పత్రిక ఎందుకు రాయలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని, ఇక్కడ ఉన్నది చంద్రబాబు, బలమైన కూటమి అని గుర్తుపెట్టుకోవాలన్నారు. గొడ్డలి పార్టీది జీవితాంతం నాటకమేనని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు. పేదల సేవలో.. కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ‘‘గొడ్డలి పార్టీ విధ్వంస పాలనతో ప్రజలంతా మోసపోయారు. వివేకా హత్య నుంచి కోడికత్తి, గులకరాయి వరకు ప్రతిదీ నాటకమే. ఏపీ భవిష్యత్తు కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నాం. కానీ గొడ్డలి పార్టీ మాత్రం రాక్షస పన్నాగాలతో కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తోంది. మేం కష్టపడి రాష్ట్రాన్ని పైకి తీసుకువెళ్లడం.. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రం అథఃపాతాళానికి పడిపోవడం.. రాష్ట్రంలో మళ్లీ మళ్లీ వైకుంఠపాళీ వద్దు’’.


విగ్రహాలను నరికేసి దొరికిపోయారు...
‘‘వైసీపీ అరాచకాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అనేక నేరాలు వాళ్లు చేసి టీడీపీపై నెట్టేసి రాజకీయలాభం పొందాలని చూస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడన్నారు. విషయం తెలిసి నేను కూడా అయ్యో పాపం అనుకున్నాను. ఇదే విషయం జగన్ చానల్‌లో ప్రసారం చేశారు. తీరా ఆయన కూతురు ఒత్తిడితో పోస్టుమార్టం చేయిస్తే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరులో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడిపోతే రోడ్డు పక్కకు లాగి పడేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళితే అక్కడ చనిపోయారు. దానిపై యాగీ చేశారు. కడప నుంచి పాస్టర్ పాడేరు వెళ్లి డ్రామా ఆడారు. ఆయనే తనపై దాడి చేయించుకుని తనపై దాడి చేశారని డ్రామా ఆడారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తూ పాస్టర్ చనిపోయాడు. దానిపై పలు అనుమానాలు రేకెత్తించారు. మొత్తం రికార్డు తీయించాం. ఎక్కడెక్కడ తిరిగాడో, ఎక్కడ తాగాడో మొత్తం రికార్డు పోలీసులు బయటకు తీశారు. జగన్ మీడియా తిరుమల కౌస్తుభం గెస్ట్‌హౌస్ వద్ద మద్యం సీసాలు వేసి మద్యం అమ్ముతున్నారని హడావుడి చేయబోయారు. విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చి జగన్ మీడియా దొరికిపోయింది. కల్తీ నెయ్యితో దేవుడిని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేశారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలను నరికేసి, సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు. కానీ, క్షణాల్లోనే దొరికిపోయారు.’’ అని చంద్రబాబు ఆగ్రహించారు.
డీఎస్సీపై వైసీపీ యాగీ
వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్‌కు దిక్కులేదని, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని సీఎం మండిపడ్డారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తే వైసీపీ దానిపై వివాదం లేవనెత్తుతోంది. టీవీలు, సోషల్‌మీడియాల్లో అనుమానాలను రేపే లా కథనాలు సృష్టిస్తున్నారు.’’ అని ఆగ్రహించారు.
ప్రజలు నవ్వుకోవడానికి కూడా లేదు...
‘‘జూన్ నెలకు ఓ విశిష్ఠత ఉంది. రాష్ట్రంలో రెండేళ్ల కిందట వైసీపీ విధ్వంసక పాలనకు తెరపడిన నెల ఇది. ఆ పార్టీ పాలనలో రాష్ట్రంలో ప్రజలు నవ్వుకోవడానికి కూడా లేదు. ఎక్కడా ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి కూడా లేదు. చివరకు జగన్ నిర్వహించిన బహిరంగ సభల్లోంచి జనం వెళ్లిపోతే ఫెన్సింగ్‌లు వేసి అడ్డుకున్నారు. ఆ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు కూటమిగా ఏర్పడాలని తొలుత పొత్తు ప్రకటించింది జనసేన అధినేత పవన్‌కల్యాణ్. చివరకు మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి విజయం సాధించాం. సరిగ్గా రెండేళ్ల కిందట జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటుచేశాం. అప్పటికి పది లక్షల కోట్ల అప్పులు. వడ్డీలకు లక్ష కోట్ల చెల్లింపులు తేలాయి. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. అయినప్పటికీ గడిచిన 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 23 లక్షల ఉద్యోగాలు యువతకు రానున్నాయి. ఈ రెండేళ్లలో ఎన్నో పెట్టుబడుల విజయాలు సాధించాం. అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిత్తల్ దగ్గర నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వరకు సాధించాం.’’
ఆరోగ్య ఏపీకి యోగా మంత్రం..
‘‘పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్ డబ్బులు ఆ నెలతోపాటు అంతకంటే రెండు నెలల వెనకవి కూడా ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం రూ.పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అయినా, 2024 జూలై నుంచి మొత్తం రూ.65,887 కోట్లు పింఛన్ల కింద చెల్లించాం. ఏడాదికి రూ.32 వేల కోట్లు ఈ పథకానికే ఖర్చు చేస్తున్నాం. ఈనెలలో 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్లు పింఛన్లు చెల్లిస్తున్నాం. ఒకపక్క పశ్చిమాసియాలో యుద్ధప్రభావంతో గ్యాస్ ధరలు, ఇంధనం ధరలు పెరిగినా, ఇచ్చిన హామీ మేరకు 3ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలుచేస్తున్నాం. దివ్యాంగశక్తి, అన్నదాత సుఖీభవ, ఇలా అందరినీ ఆదుకుంటు న్నాం. ఆగస్టు 15నుంచి ప్రజలఆరోగ్యం కోసం సంజీవిని ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాం. మీరు నా ఆరోగ్యం చూస్తూ ఉంటారు. ఎప్పుడూ అనార్యోగానికి గురికాలేదు. అతిగా తినను. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడంలో యోగాది కీలకపాత్ర. ప్రపంచాన్ని మనమే మోస్తున్నట్టు పరుగెత్తి అలసిపోవద్దు.’’
బస్సెక్కి ప్రజలవద్దకెళ్తా
రాష్ట్రంలో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకుంటానని సీఎం పేర్కొన్నారు. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడకు బస్సులో ప్రజలను తీసుకుని వెళ్లి పరిశీలిస్తానన్నారు. నెలకు నాలుగైదు రోజులు జిల్లాల పర్యటనల్లో ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ బస్సు లు తీసుకువస్తామని, ఆ ఏసీ బస్సుల్లో మహిళలు తిరగాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు.
గురుకులాల్లోనూ 62 ఏళ్లకు రిటైర్మెంట్
ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం
రాష్ట్రంలోని సుమారు 11 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాలు, సొసైటీ పాఠశాలల ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు సీఎం ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. దీనిపై ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు.
పూరీల కోసం చర్చ... అంతా నవ్వులే...
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన పేదల సేవలో... కార్యక్రమంలో అన్నక్యాంటీన్ల ప్రస్తావన వచ్చింది. ఉదయం టిఫిన్‌లో అందిస్తున్న పూరీలు సరిగా పొంగడం లేదని పలుచోట్ల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన విషయాన్ని సీఎంకు అధికారులు ప్రస్తావించారు. పూరీలు పొంగకపోవడానికి సాంకేతిక కారణాలను అధికారి వివరించే ప్రయత్నం చేయగా, సభా ప్రాంగణంలో సరదా వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునవ్వుతో, కారణాలు చెప్పడం కాదు... సమస్యలు పరిష్కరించడం ముఖ్యం అని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలి
తుని నియోజకవర్గం కార్యకర్తలకు సీఎం నిర్దేశం
రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అనేలా కార్యకర్తలు పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ‘‘2024లో కూటమి పొత్తు సూపర్‌హిట్ అయింది. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని రికార్డు సాధించాం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి. ఫలానా సెగ్మెంట్‌లో ఓడిపోయామని ఎవరైనా తన దగ్గరకు వస్తే మాట్లాడనంటూ సున్నితంగా హెచ్చరించారు. కార్యకర్తలు ప్రజలకు కనిపించడం మా నేస్తే ప్రభుత్వం మంచి చేసినా అధికారులే చేశారని అనుకుంటారన్నారు. 2024లో టీడీపీకి 55శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఈరెండేళ్లలో పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి పర్సంటేజీ పెరగాలని ఆదేశించారు. తుని నియోజకవర్గం ఇంకా కొంత మెరుగవ్వాలని పేర్కొన్నారు. ఇకనుంచి పార్టీ క్యాడర్ ప్రజల్లోకి వాహనాలపై కాకుండా చార్జింగ్ సైకిల్‌పై వెళ్లాలని, మహిళలు ఎలక్ట్రికల్ స్కూటీలపై వెళ్లాలని సూచించారు.
కల్లుగీత కార్మికుడి ఇంటికి సీఎం
సింహాచలం కుటుంబానికి పింఛను
కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసాన్ని చంద్రబాబు సందర్శించారు. ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుడైన సింహాచలానికి సీఎం స్వయంగా రూ.4వేల పింఛను అందజేశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతోపాటు సింహాచలం మనవడిని ప్రేమగా ముద్దాడి అందరినీ ఆకట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడి వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. కల్లుగీత వృత్తిలో కష్టనష్టాల గురించి ఆరా తీశారు. తాటిచెట్లపైకి ఎక్కి కల్లు గీయడంలో ఉన్న ప్రమాదాలు, శ్రమ గురించి సింహాచలం వివరించారు. ప్రస్తుతం తాను ఆరు తాటి చెట్ల నుంచి కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నట్టు సీఎంకు తెలిపారు. అలాగే సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటి చెట్టుపైకి ఎక్కి కల్లు తీసే విధానాన్ని ప్రదర్శించారు. కల్లుగీత ప్రక్రియను చంద్ర బాబు ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం తాజాగా తీసిన కల్లును సీఎం చంద్రబాబు రుచి చూశారు. ’
