Share News

అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పకూడదు.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:44 PM

అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.

 అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పకూడదు..  మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
AP CM Chandrababu Naidu issued strict guidelines to ministers

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 11: అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలనలో క్రమశిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు: మంత్రులకు సూచన.. అమరావతికి హెల్త్, ఎడ్యుకేషన్ సిటీలు!

కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై ఆయన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

AP-cabinet.jpgమంత్రులకు సీఎం దిశానిర్దేశం:

సమయపాలన: మంత్రులందరూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తప్పనిసరిగా అసెంబ్లీలో ఉండాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత తమ పేషీల్లో ఉండి ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

బాధ్యతాయుత ప్రసంగాలు: అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్థమయ్యేలా ఉండాలని మంత్రులకు చెప్పారు. మాట్లాడే ప్రతి మాట బాధ్యతగా ఉండాలని హెచ్చరించారు.

ప్రిపరేషన్: సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో, ప్రిపేరై అసెంబ్లీకి రావాలని సూచించారు.

AP-cabinet-2.jpg


కీలక మార్పులు - నిర్ణయాలు:

పేర్ల మార్పు: రాష్ట్రంలోని వార్డులు, సచివాలయాల పేర్లను 'స్వర్ణ వార్డు', 'స్వర్ణ సచివాలయాలు'గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అసైన్డ్ భూముల కౌలు: సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతినిచ్చారు. దీనికింద ఏడాదికి ఎకరాకు 30 వేల రూపాయల కౌలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.

జల జీవన్ మిషన్: ఏపీకి రావాల్సిన 12 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని, ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.

AP-cabinet-3.jpgఅమరావతికి మహర్దశ:

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీలను అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్రానికి చేసిన సూచనలకు సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

శ్రీశైలం ఘటనపై చర్చ:

శ్రీశైలంలో భక్తుల రద్దీ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం చర్చించారు. వృద్ధులను క్యూ లైన్ల నుంచి బయటకు తెచ్చే సమయంలో భక్తులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా, మైక్ ద్వారా ముందే అనౌన్స్ చేసి వివరించి ఉండాల్సిందని సీఎం అన్నారు.

AP-cabinet-4.jpg


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 05:57 PM