Share News

ఏపీలో స్వర్ణాధ్యాయం!

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:55 AM

జొన్నగిరి గోల్డ్‌ మైన్‌లో బంగారం వెలికితీతతో రాయలసీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....

ఏపీలో స్వర్ణాధ్యాయం!

ఏపీలో పండని పంటలు లేవు. దొరకని ఖనిజాలూ లేవు. మంగంపేటలో బెరైటీస్‌, కడపలో లైమ్‌ స్టోన్‌, యురేనియం; విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌, చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్‌, కుప్పంలో గ్రీన్‌ గ్రానైట్‌, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్‌, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్‌ శాండ్‌; అనంతపురం, కడపలో ఐరన్‌ ఓర్‌; కేజీ బేసిన్‌లో గ్యాస్‌, పెట్రోల్‌ లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి వాల్యూ ఎడిషన్‌ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీ మోడల్‌గా మారింది.

- సీఎం చంద్రబాబు

  • రాయల సీమ గ్రోత్‌ ఇంజన్‌ ‘జొన్నగిరి’

  • రాష్ట్రం అన్నపూర్ణే కాదు, రత్నగర్భ కూడా..

  • జొన్నగిరిలో జ్యూవెలరీ పార్కు ఏర్పాటు

  • దేశానికి సరిపడా బంగారం ఇక్కడి నుంచే..

  • చిత్తూరు, అనంతలోనూ త్వరలో గోల్డ్‌ మైన్స్‌

  • కర్నూలు జిల్లా జొన్నగిరి సభలో చంద్రబాబు

  • జియో మైసూర్‌-జొన్నగిరి ప్రాజెక్టు ప్రారంభం

  • జొన్నగిరికి స్వర్ణగిరిగా పేరు మార్పు

కర్నూలు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జొన్నగిరి గోల్డ్‌ మైన్‌లో బంగారం వెలికితీతతో రాయలసీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర ముంగిట సువర్ణాధ్యాయం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. జొన్నగిరి గోల్డ్‌ మైన్‌ సీమ అభివృద్ధికి గ్రోత్‌ ఇంజన్‌ అవుతుందన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద రూ.405 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ‘జియో మైసూర్‌- జొన్నగిరి గోల్డ్‌ మైన్‌ ప్రాజెక్టు’ను చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. జియో మైసూర్‌ - డెక్కన్‌ గోల్డ్‌మైన్స్‌, త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ సంస్థలు సంయుక్తంగా దీనిని నెలకొల్పాయి. అలాగే.. ప్లాంట్‌ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోల్డ్‌ మైన్‌ ప్రాంగణం, ప్రాసెసింగ్‌ యూనిట్‌, బంగారం శుద్ధి ప్లాంట్‌ను పరిశీలించారు. త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ సంస్థ చైర్మన్‌ బి. ప్రభాకరన్‌, డైరెక్టర్‌ కార్తికేయన్‌ ఆయనకు మైనింగ్‌ మొదలుకొని బంగారం శుద్ధి చేసే మొత్తం ప్రక్రియను వివరించారు. జొన్నగిరి కేంద్రంగా ఉత్పత్తి చేసిన బంగారు బిస్కట్లు, బంగారాన్ని పరిశీలించారు. బంగారం శుద్ధి కోసం బంగారు ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మైనింగ్‌ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్‌ యంత్రాలపై మహిళలు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశానికి సరిపడా బంగారం జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్‌ నుంచే సరఫరా కానుంది. ఇది దేశానికి తలమానికం అవుతుంది.’’ అంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


జొన్నగిరి ఇక.. స్వర్ణగిరి

‘‘జొన్నగిరి ఘనత ఈనాటికి కాదు. అశోకుడి నాలుగో రాజధాని అయిన స్వర్ణగిరే ఈనాడు జొన్నగిరిగా ప్రసిద్ధిలోకి వచ్చింది. వందల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, వజ్రాలతో నిండిపోయింది. ఇక్కడికి సమీపంలోని ఎర్రగుడిలోని అశోకుడి శిలాశాసనాలు ఈ ప్రాంత గత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. జొన్నగిరికి ఇక స్వర్ణగిరిగా నామకరణం చేద్దాం. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధన ప్రధాని మోదీ సంకల్పం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది నా ఆలోచన. జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్‌ సాకారంగా నిలవనుంది. దేశ అవసరాల కోసం 800 కిలోల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ జొన్నగిరిలో ఏడాదికి వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి కానుంది. దీని వల్ల విదేశీ మారక నిల్వలను కొంతవరకు కాపాడుకోవచ్చు. త్వరలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా గోల్డ్‌మైన్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇక్కడఉత్పత్తి చేసిన బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్లి విక్రయించడం కాదు.. జొన్నగిరి కేంద్రంగా బంగారు ఆభరణాల తయారీ జ్యూవెలరీ పార్కు ఏర్పాటు చేస్తాం. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఏపీ ఇక అన్నపూర్ణే కాదు.. రత్నగర్భ కూడా. అక్రమ సంపాదన కోసం గత పాలకులు పరిశ్రమలను తరిమేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడిదారులు విశ్వాసం పెరిగి ఏపీకి క్యూ కడుతున్నారు. ఏరో స్పేస్‌, డిఫెన్స్‌, ఎలక్ట్రానిక్స్ , ఆటో మొబైల్‌, స్టీల్‌, సిమెంట్‌, క్లీన్‌ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సిటీ కర్నూలులో ఏర్పాటు చేస్తున్నాం. ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌ అభివృద్ధి చేస్తున్నాం. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం జిల్లాకు కియ పరిశ్రమ తెచ్చాం. ఇక్కడ ఫిఫ్త్‌ జనరేషన్‌ ఫైటర్‌ జెట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నాం. 2028 నాటికి ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా రాయలసీమ (కడప) స్టీల్‌ ప్లాంట్‌కు జూలై 3న శంకుస్థాపన చేస్తున్నాం. కొప్పర్తి ఇండస్ట్రియల్‌ నోడ్‌ అభివృద్ధి. తిరుపతిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పరిశ్రమ తీసుకొచ్చాం.’’


బీజం వేసింది ఎన్టీఆర్‌

‘‘రాయలసీమ కరువు నేలకు కృష్ణా జలాలు మళ్లించి సీమ ముఖచిత్రమే మార్చాలనే మహా సంకల్పంతో సీమ సాగునీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ బీజం వేశారు. రాయలసీమ పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో హార్టికల్చల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడుతున్నాం. గండికోట వంటి ప్రాంతాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాం. గత పాలకుల వైఫల్యాల వల్ల వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టి దేశంలో నం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ.7 వేలు చొప్పున ఖాతాలో జమ చేశాం.’’

ఇదీ ఫ్యాక్షన్‌ నేతల మైండ్‌సెట్‌

‘‘రాజకీయ ముసుగు వేసుకున్న గొడ్డలి పార్టీ గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లకు అండగా నిలుస్తోంది. యువతను చెడు మార్గం పట్టించి, రాజకీయ అవసరాలకు వాడుకొని బలి చేస్తోంది. ఇదీ ఫ్యాక్షన్‌ నేతల మైండ్‌సెట్‌. ఆ పార్టీ విజన్‌ విధ్వంసం. విధానం ఫేక్‌ ప్రచారం.. మేనిఫెస్టో రప్పారప్పా.. బాబాయి హత్య నుంచి పాస్టర్‌ రోడ్డు ప్రమాదం వరకు కుట్రలను నమ్ముకుంది. వారిలా రప్పారప్పా రాజకీయాలు చేసేందుకు మేం లేం. ఆ పార్టీకి భవిషత్తు లేదు.’’

Updated Date - Jun 25 , 2026 | 03:56 AM