Srikalahasti Robbery: శ్రీకాళహస్తిలో రెచ్చిపోయిన దుండగులు.. భారీగా నగదు చోరీ..
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:16 PM
శ్రీకాళహస్తిలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. పెద్ద ఎత్తున నగదు, నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
తిరుపతి, జనవరి 8: జిల్లాలోని శ్రీకాళహస్తి సురావారిపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. గత అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.15 లక్షల విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి సూరావారిపల్లెలో నివాసం ఉంటున్నారు. తన అల్లుడి ఇరుముడి కోసం ప్రసాద్ చెన్నైకి వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన దుండగులు బుధవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు రూ.15 లక్షల సొత్తు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఉదయం పని చేసేందుకు వచ్చిన పనిమనిషి ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించింది. వెంటనే ఇంటి యజమాని ప్రసాద్ నాయుడితో పాటు.. పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాధితులు ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఎంత మేరకు నష్టం జరిగిందో చెప్పిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ వెంకటేష్ వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..
మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్
Read Latest AP News And Telugu News