Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం..
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:21 AM
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది అక్కడకు చేరుకుని చిరుత కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తిరుమల, జనవరి 9: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలో 400వ మెట్టు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా నేటి (శుక్రవారం) ఉదయం కొంత సేపు నడక మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపేశారు. ఆపై శ్రీవారి మెట్టు మార్గమంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారుల సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా గత కొద్దిరోజులుగా అలిపిరి, శ్రీవారి మెట్టు, మోకాళ్ల మెట్టు నడక మార్గాల్లో తరుచుగా చిరుతల సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు చిక్కడంతో టీటీడీ తరుచూ నడక మార్గాలను తాత్కాలికంగా మూసివేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా నడక మార్గాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతినిచ్చారు. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటవీ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పడవేయొద్దని సూచించారు. చిరుత కనిపించిన వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాల్సిందిగా ఇప్పటికే టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఎస్సీ కార్పొరేషన్ వాహనాల స్థితిపై కమిటీ
రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేష్
Read Latest AP News And Telugu News