తిరుపతిలో కవలల దినోత్సవం.. ఒకే వేదికపై 100 మంది కవలలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:38 PM
అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 100 మందికి పైగా కవలలు ఒకే వేదికపైకి చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒకే పోలికలతో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు, ఈ వేడుకలు తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తిరుపతి, ఫిబ్రవరి 23: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నిన్న(ఆదివారం) అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. వేమన విజ్ఞాన కేంద్రంలో ‘ప్రపంచ కవలల దినోత్సవం(World Twins Day)’ పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో భాగంగా 100 మంది కవలలు ఒకేచోట చేరి ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఒకే రకమైన దుస్తులు ధరించి, ఒకే పోలికతో ఉన్న కవలలను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా కొందరు కవలలు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఒకరి బదులుగా మరొకరు పరీక్ష రాసినా టీచర్లు కనుక్కోలేకపోయేవారని ఫన్నీ మూమెంట్స్‌ను గుర్తు చేసుకున్నారు.
‘మేం ఇద్దరం ఒకేలా ఉండటమే కాదు, మా ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయి. ఈ రోజు ఇంతమంది కవలలను కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని ఒక జంట తమ జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ, తమిళనాడు, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఈ వేడుకకు వచ్చారు. కవలల మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని గౌరవించడానికి, వారిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం
కాకినాడ పెన్సిలిన్-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి