ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:27 AM
దేశ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా పరిరక్షణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద అత్యంత భద్రతా ఏర్పాట్లతో...
చైనా, పాక్ దాడుల నుంచి రక్షణ
భూకంపాల నుంచి రక్షణ కవచం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా పరిరక్షణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద అత్యంత భద్రతా ఏర్పాట్లతో కూడిన రెండో ప్రత్యేక డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అత్యంత వ్యూహాత్మకంగా ఆర్‌బీఐ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని భావిస్తున్నారు. ఈ కేంద్రంలో ఆర్‌బీఐ కరెన్సీ నిర్వహణ, చెల్లింపులు, సెటిల్‌మెంట్ కార్యకలాపాలు, రెగ్యులేటరీ డేటా, విశ్లేషకులు, అధికారుల విధులకు అవసరమైన కీలక కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
ఎందుకంటే?
ముంబైలో ఇప్పటికే ఆర్‌బీఐ ప్రత్యేక డేటా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. చైనా లేదా పాక్ ఈ కేంద్రంపై దాడి చేస్తే ఈ కేంద్రంలోని దేశ ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులకు సంబంధించిన కీలక డేటాతో పాటు అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థలు కూడా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకే ఆర్‌బీఐ భువనేశ్వర్ సమీపంలో ఈ కీలక డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని భావిస్తున్నారు.
ఇతర కారణాలు
భువనేశ్వర్ భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల జోన్‌లకు కూడా దూరంగా ఉంది. దీనికి తోడు ముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ నగరాల్లోలా భువనేశ్వర్‌లో పెద్దఎత్తున డేటా కేంద్రాలు లేవు. దీంతోపాటు ఒడిశా తీరానికి విదేశాల నుంచి అండర్‌సీ కేబుల్ వ్యవస్థా లేదు. దీంతో సైబర్ కేటుగాళ్ల నుంచి పెద్దగా భయం ఉండక పోవచ్చు. ఆర్‌బీఐ తన రెండో డేటా కేంద్రాన్ని భువనేశ్వర్‌లో ఏర్పాటు చేయడానికీ ఇది కూడా మరో కారణమని భావిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ అనుభవం
ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దేశానికి చెందిన ఒక ప్రముఖ వాణిజ్య బ్యాంకు కీలకమైన తన డేటా కేంద్రాన్ని రాత్రికి రాత్రి ఆఘమేఘాల మీద జైసల్మేర్ నుంచి ముంబైకి తరలించింది. పాక్ ఆ డేటా కేంద్రంపై దాడి చేసే అవకాశం ఉందనే భయాలే ఇందుకు కారణం. ముంబైతో పోలిస్తే భువనేశ్వర్ చైనా, పాక్ సరిహద్దులకు దూరంగా ఉంది. దీంతో ఈ రెండు దేశాల ఉగ్రవాదులు గానీ, యుద్ధ విమానాలు, డ్రోన్లు గానీ అడ్డు లేకుండా భువనేశ్వర్ వరకు వచ్చే అవకాశం తక్కువ. రెండో డేటా సెంటర్ కోసం ఆర్‌బీఐ భువనేశ్వర్‌ను ఎంచుకోవడం వెనక ఇది కూడా ఒక బలమైన కారణంగా కనిపిస్తోంది. అమెరికా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ దేశాల కీలక ఆర్థిక, చెల్లింపుల లావాదేవీల డేటా పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలే తీసుకుంటున్నాయి. ఆర్‌బీఐ కూడా వీటి బాటలోనే పయనిస్తోంది.
ఇవీ చదవండి:
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్