Share News

కాకినాడ పెన్సిలిన్‌-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:22 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అరబిందో ఫార్మా తన పెన్సిలిన్‌-జీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిస్తోంది. కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)లో ఏర్పాటు చేసిన ఈ పెన్సిలిన్‌ ప్లాంట్‌...

కాకినాడ పెన్సిలిన్‌-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి

  • త్వరలో చైనా ప్లాంట్‌ లాభాల్లోకి

  • అరబిందో ఫార్మా సీఎ్‌ఫఓ సుబ్రమణియన్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అరబిందో ఫార్మా తన పెన్సిలిన్‌-జీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిస్తోంది. కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)లో ఏర్పాటు చేసిన ఈ పెన్సిలిన్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం వచ్చే ఏడాది కాలంలో 10,000 టన్నులు మించిపోతుందని ఇన్వెస్టర్స్‌ కాల్‌లో సంస్థ సీఎ్‌ఫఓ సుబ్రమణియన్‌ చెప్పారు. ముందు ముందు ఈ ప్లాంట్‌ స్థాపిత వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 15,000 టన్నులకు చేరుతుందన్నారు.

పెన్సిలిన్‌-జీ ప్రాధాన్యత

పెన్సిలిన్‌-జీ అనేక కీలక యాంటీ బయాటిక్స్‌ ఔషధాలకు ప్రధాన ముడి పదార్ధం. ప్రస్తుతం ఈ ముడి పదార్ధం కోసం మన దేశ ఫార్మా కంపెనీలు ఎక్కువగా చైనా కంపెనీలపై ఆధారపడుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు పెన్సిలిన్‌-జీతో సహా ఫార్మా పరిశ్రమకు అవసరమైన కీలక ముడి పదార్ధాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా అరబిందో ఫార్మా కాకినాడలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి క్రమంగా ఉత్పత్తి పెంచుతోంది. మరోవైపు పెన్సిలిన్‌-జీ దిగుమతికి కనీస ధర నిబంధనను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించడం సానుకూల పరిణామమని సుబ్రమణియన్‌ అన్నారు.

బ్రేక్‌ఈవెన్‌కు చైనా ప్లాంట్‌

ఓరల్‌ సాలిడ్‌ డోసేజీ (ఓఎ్‌సడీ) ఔషధాల కోసం చైనాలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ ఈ ఏడాది మార్చితో ముగిసే త్రైమాసికంలో లాభనష్టాలు లేని స్థితికి (బ్రేక్‌ ఈవెన్‌) వస్తుందని సుబ్రమణియన్‌ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి ఈ ప్లాంట్‌ కంపెనీ లాభాలకు బాగా తోడ్పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ఔషధాలకు యూరోపియన్‌ దేశాల నుంచి 10 అనుమతులు, చైనా ప్రభుత్వం నుంచి 3 అనుమతులు లభించిన విషయాన్ని సుబ్రమణియన్‌ గుర్తు చేశారు. కాగా మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాల శాతం ఎంత లేదన్నా 20 నుంచి 21 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 23 , 2026 | 04:22 AM