DSC: డీఎస్సీలో తప్పులుంటే ఆధారాలు చూపండి
ABN , Publish Date - May 31 , 2026 | 12:46 AM
గత ఎన్నికల్లో వైసీపీని నిరుద్యోగ యువత 11 సీట్లకే పరిమితం చేసిందన్న అక్కసుతోనే వారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా యువత తిరుగుబాటు చేయాలని శాప్ ఛైర్మన్ రవి నాయుడు పిలుపునిచ్చారు.
తిరుపతి సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో వైసీపీని నిరుద్యోగ యువత 11 సీట్లకే పరిమితం చేసిందన్న అక్కసుతోనే వారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా యువత తిరుగుబాటు చేయాలని శాప్ ఛైర్మన్ రవి నాయుడు పిలుపునిచ్చారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ తిరుపతిలో శనివారం ‘నిరుద్యోగ యువతపై గొడ్డలిపోటు’ పేరిట మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కల్యాణమండపంలో జరిగిన ఈ సమావేశంలో రవి నాయుడు మాట్లాడుతూ ‘సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ నేతృత్వంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు బాధ కల్గిస్తున్నాయి. పేద కుటుంబాలనుంచి కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాజకీయంగా కక్ష తీర్చుకోవాలంటే మాపై తలపడండి. యువత జీవితాలతో ఆడుకోవద్దు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో యువత కోరిక మేరకు డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని యువనేత లోకేశ్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 16వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశారు. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు సుప్రీం కోర్టు వరకు వెళ్లి 150కి పైగా కేసులు వేయించారు. ఒక వ్యక్తి చేసిన నిరాధార ఆరోపణలు పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు. అతనిపై ఆ రోజే కేసు నమోదు చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నామని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఇచ్చేది క్రీడా సంఘాలు, సమాఖ్యలు అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా వైసీపీ మాట్లాడటం సిగ్గుచేటు. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో వారి జాబితా బహిరంగపరిచాం. ఆధారాలుంటే నిరూపించండి. నిరుద్యోగుల రక్తపు కూడు తినే ఖర్మ కూటమి నేతలకు లేదు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని’ ఆయన సవాల్ విసిరారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఉద్యోగం సంపాదించుకునేందుకు యువత రాత్రింబవళ్లు కష్టపడ్డారని, అలాంటి వారిపై వైసీపీ నిందలు వేయడం సరికాదని, రాష్ట్రం నుంచి జగన్‌ను యువత తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. జగన్ రెడ్డి అవినీతి చరిత్ర ఏమిటో, గత జీవితమేంటో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో వివిధ కారణాలతో ఉద్యోగాలు రాని పలువురు అభ్యర్థులను తానే స్వయంగా విద్యాశాఖ అధికారుల వద్దకు తీసుకెళ్లి వారి అనుమానాలను నివృత్తి చేశానన్నారు. యువత ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడటం సరైందికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ఎంత అడ్డగోలుగా జరిగిందో అందరికీ తెలుసన్నారు. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసే అర్హత వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు.
మమ్మల్ని బలిపశువులను చేయొద్దు : కన్నీటి పర్యంతమైన టీచర్లు
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి చదువుకుని, ఉద్యోగాలు సాధించిన తమను అవహేళన చేయడం దారుణమని సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తమ కుటుంబాలలో తీవ్ర అలజడిని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తమను బలిపశువులు చేయవద్దని ఓ మహిళా ఉపాధ్యాయరాలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుయువత నేతలు రాగల ఆనంద్ గౌడ్, కొట్టే హేమంత్ రాయల్, తోట వాసు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.