ఏబీఎన్ ఎఫెక్ట్.. శ్రీకాళహస్తిలో ఫేక్ పూజల ప్రచారం.. ఆలయ అధికారుల అలర్ట్
ABN , Publish Date - Feb 09 , 2026 | 10:10 AM
మహాశివరాత్రి రోజున శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజలు చేస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో దేవధాం యాప్ పేరుతో ప్రచారం జరిగింది. ఈ వివరాలు సేకరించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి.. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది..
తిరుపతి, ఫిబ్రవరి 9: శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజున రాహు కేతు పూజలు నిర్వహిస్తామంటూ ప్రచారం చేసిన దేవధాం యాప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజు రాహు కేతు పూజలు నిర్వహిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో దేవధాం యాప్ పేరుతో కొందరు ప్రచారం నిర్వహించారు. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఆలయం ముందు నుంచి వీడియో చిత్రీకరణ చేయిస్తామని చెప్పారు. అయితే, శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి రోజు రాహు కేతు పూజల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజలు నిర్వహించే పద్ధతికి భిన్నంగా దేవధాం యాప్ చార్జీలు ప్రకటించింది. ఆలయంలో పూజలో పాల్గొనే వారికి ఎక్కడ పూజ చేసుకుంటారో అనేదాన్ని బట్టి చార్జీలు నిర్ణయిస్తారు. కానీ, ఈ యాప్‌లో మాత్రం ఎంత మంది పాల్గొంటే అంత ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, పూజ తర్వాత ప్రసాదాలు ఇచ్చే సంప్రదాయం ఆలయంలో లేకపోయినా.. దేవధాం యాప్.. ప్రసాదాన్ని కొరియర్ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రచారాన్ని గుర్తించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు.. వీడియోలు, యాప్‌లోని వివరాలను సేకరించి.. శ్రీకాళహస్తి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వివరాలు తీసుకున్న ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేవధాం యాప్‌పై శ్రీకాళహస్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భక్తులు ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
మునిసిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థిగా రిటైర్డ్ ఎస్సై భార్య
Read Latest AP News And Telugu News