Share News

మునిసి ‘పోలీస్‌’ పాలిట్రిక్స్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:30 AM

ఆమె ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ భార్య.. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీలో 2వ వార్డును...

మునిసి ‘పోలీస్‌’ పాలిట్రిక్స్‌

  • చేర్యాలలో పోలీసు భార్య పోటీ

  • కాంగ్రెస్‌ అభ్యర్థిగా రిటైర్డు ఎస్సై భార్య

  • కానిస్టేబుల్‌ రమేశ్‌పై సస్పెన్షన్‌ వేటు

చేర్యాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆమె ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ భార్య.. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీలో 2వ వార్డును, చైర్‌పర్సన్‌ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌ కమలాపురం రమేశ్‌ భార్య గీతాంజలి.. రెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు ప్రత్యర్థిగా రిటైర్డ్‌ ఎస్‌ఐ కాటం సంజీవులు భార్య ముస్త్యాల తేజ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా తేజ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గీతాంజలి పోటీలో ఉన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కమలాపురం రమేశ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసిన పోలీసు ఉన్నతాధికారులు.. ఓ అడుగు ముందుకేసి శనివారం అర్ధరాత్రి ఆయన ఇంటికెళ్లి ఆ ఉత్తర్వులు అందజేయడం చేర్యాలలో చర్చనీయాంశమైంది. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇటీవలే తన భర్తను సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేసి.. తాజాగా సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని నిరసించారు. ఎన్నికల ప్రచారానికి తన భర్త దూరంగా ఉన్నా.. కాంగ్రెస్‌ నేతల ఒత్తిడితోనే పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనులమైన తమను రాజకీయాల్లోకి రాకుండా కాటం సంజీవయ్య వేధిస్తున్నారని గీతాంజలి ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని, లొంగక పోవడంతో తన భర్తపై సస్పెన్షన్‌ వేటు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు బలంతో పేద కుటుంబాలను రోడ్డున పడేయడం సమంజసం కాదని వాపోయారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతానన్న గీతాంజలి.. తక్షణం తన భర్తపై సస్పెన్షన్‌ ఎత్తేయాలన్నారు. పోలింగ్‌కు 2 రోజుల ముందు జరిగిన ఈ పరిణామంతో చేర్యాల రెండో వార్డుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలీసుశాఖ నిబంధనల ప్రకారం పోలీసుల జీవిత భాగస్వాములు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. తర్వాత పోలీసులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు.

Updated Date - Feb 09 , 2026 | 02:30 AM