శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాల విరాళం.. జైన్ దంపతులకు చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 07:19 PM
తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు సమర్పించిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. స్వామివారికి బంగారు, వజ్రాభరణాలను భక్తితో సమర్పించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
తిరుమల, నవంబర్ 26: తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు సమర్పించిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. స్వామివారికి బంగారు, వజ్రాభరణాలను భక్తితో సమర్పించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల నుంచి జైన్ దంపతుల వరకు తిరుమల వేంకటేశ్వరుడిపై భక్తి పరంపర కొనసాగడం హర్షణీయమన్నారు. సంపదను దేవుడికి, సమాజ హితానికి వినియోగించడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు. జైన్ కుటుంబానికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్ట్..
'ఓం నమో వేంకటేశాయ!.. తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను భక్తితో కానుకలుగా సమర్పించిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. ఏడుకొండలవాడికి కానుకల సమర్పణలో ఆనాటి శ్రీకృష్ణదేవరాయల నుంచి నేటి జైన్ దంపతుల వరకు శ్రీవారిపై భక్తి పరంపర కొనసాగడం హర్షణీయం. భగవంతుడు ప్రసాదించిన సంపదలో కొంత భాగాన్ని ధార్మిక సేవకు, సమాజ హితానికి వినియోగించడంలోనే నిజమైన ఆనందం ఉంది. జైన్ దంపతుల భక్తి, ఉదారత అందరికీ స్ఫూర్తిదాయకం. శ్రీవారి ఆశీస్సులు వారి కుటుంబానికి, ప్రజలందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
కాగా, ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో వర్ధమాన్ జైన్ దంపతులు శ్రీవారికి బంగారు ఆభరణాలను సమర్పించారు. సుమారు రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల స్వర్ణ, వజ్రాభరణాలను కానుకగా అందించారు. ఈ మేరకు 46 రకాల వేర్వేరు ఆభరణాలను తయారు చేయించి తమ భక్తిని చాటుకున్నారు. ఆభరణాల్లో బంగారు పాద కవచాలు - 3, బంగారు అందెలు - 3, బంగారు పాకడాలు, బంగారు తులసిపాత్ర హారం, బంగారు అష్టోత్తర కాసుల మాల, బంగారు చతుర్భుజ లక్ష్మీహారం, బంగారు పులిగోరు, బంగారు అశ్వత్థ పాత్ర హారం ఉన్నాయి. అలాగే, బంగారు సాధా వడ్డాణం, బంగారు గంటల మొలతాడు, బంగారు సూర్యకటారి, బంగారు కిరీటాన్ని సమర్పించారు. బంగారు కిరీటంతో పాటు 2,427 క్యారెట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో కూడిన శ్రీవత్సం పతకం, 238.2 క్యారెట్ల బరువున్న వజ్రాలు పొదిగిన ఆభరణాలు కూడా ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో పంటల బీమా దరఖాస్తులు 2.3 రెట్లు పెరిగాయి.. రైతులకు అచ్చెన్నాయుడు కీలక సూచన
డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!