Share News

సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆరా

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:56 PM

చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను చంద్రబాబు ప్రారంభించారు.

సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆరా
CM Chandrababu Naidu

కుప్పం/అమరావతి, జులై 4: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను చంద్రబాబు ప్రారంభించారు. సీటీ స్కాన్ ద్వారా రోజూ ఎంత మందికి సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ 30 నుంచి 40 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుప్పం ఏరియా ఆస్పత్రిని సందర్శించి.. వ్యర్ధాలను వదిలేయడంపై ఆరా తీశారు. చెత్తను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమనేది ముఖ్యమని చంద్రబాబు వెల్లడించారు. హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేయడంతోపాటు.. ప్రతి అంశంలోనూ డేటా ఇంటిగ్రేషన్ చేయాలని ఆదేశించారు. డయాలసిస్ వార్డును సందర్శించగా.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కుప్పం ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ నిమిత్తం వస్తున్నారని అధికారులు తెలిపారు. సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజలు సంతృప్తి చెందాలని.. కుప్పంలో ఏ మేరకు ప్రజలకు మేలు కలిగిందనే వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.


కుప్పం ఏరియా ఆస్పత్రిలో పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఆపై మొక్క నాటారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డవారికి మెడిటేషన్ ద్వారా ఆరోగ్యం మెరుగుపడేలా సహకారం అందిస్తున్నట్టు సీఎంకు బ్రహ్మకుమారీ సంస్థ ప్రతినిధులు వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటిని నివారించేలా మరింత కఠినంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యులకు తక్షణ సమాచారం అందించేలా ఓ ఎక్విప్మెంట్‌ను రూపొందించిన బాలుడిని సీఎం అభినందించారు. కుప్పం నగరంలో ఏర్పాటు చేసిన స్వర్ణ కుప్పం-స్వచ్ఛ కుప్పం ఎంట్రన్స్ ఆర్చ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, కుప్పం స్థానిక నేతలు, చిత్తూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

అల్లూరి జయంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. నెట్‌‌జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్ల పరిశీలన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 02:17 PM