కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. నెట్‌జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్ల పరిశీలన
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:22 PM
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నలగంపల్లె గ్రామంలో నెట్‌జీరో విధానాన్ని అవలంభిస్తోన్న ఇళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు.
చిత్తూరు, జులై 4: జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శనివారం) కడపల్లెలోని సీఎం నివాసం వద్దకు అభిమానులు, కుప్పం స్థానికులు భారీగా చేరుకున్నారు. వారందరినీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై స్థానికులు వినతిపత్రాలు అందించారు. అనంతరం నలగంపల్లె గ్రామంలో నెట్‌జీరో విధానాన్ని అవలంభిస్తోన్న ఇళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు.

గ్రామంలోని రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్‌టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. నలగంపల్లి నమూనాను కేస్ స్టడీగా తీసుకుని కుప్పం వ్యాప్తంగా నెట్‌జీరో విధానాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

నలగంపల్లిలోని ఓ గ్రామస్థుని ఇంటికి వెళ్లిన సీఎం.. సోలార్ ప్యానెళ్ల సంఖ్య, విద్యుత్ ఉత్పత్తి, ఇంటి అవసరాలకు సరిపోతుందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగిస్తూ నెలకు సుమారు రూ.400 వరకు ఆదా చేస్తున్నామని సీఎంకు లబ్ధిదారులు వివరించారు.

వర్షపు నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్ట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. నెట్‌జీరో విధానంలో భాగంగా ఈవీ వాహనాల వినియోగాన్ని కూడా చేర్చాలని సూచించారు. సర్క్యులర్ ఎకానమీని గ్రామస్థాయిలో అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నలగంపల్లి అనుసరిస్తున్న విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
అల్లూరి సీతారామరాజు.. ధైర్యసాహసాలకు ప్రతీక: హోంమంత్రి అనిత
అల్లూరి జయంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు
Read Latest AP News And Telugu News