Share News

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్‌పై లంకా దినకర్ ఫైర్

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:52 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు.

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్‌పై లంకా దినకర్ ఫైర్
Lanka Dinkar

అమరావతి, జులై 4: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు. ‘మావిగన్’ తూటా లేని గన్ అని.. అది పేలదంటూ సెటైర్ విసిరారు. ‘నిన్న మూడు రాజధానులు మా నినాదం అన్నారు.. ఈరోజు మావిగన్ మా నినాదం అన్నారు.. రేపు ఏమిటో అర్థం కానీ అయోమయం జగన్నాధం మా నినాదం అనే విధంగా జగన్ తీరు ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. జగన్ సంకల్పం, ధ్యేయం మాత్రం వినాశక ఏపీ అంటూ మండిపడ్డారు.


డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో రాష్ట్రం సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతోందని లంకా దినకర్ అన్నారు. హార్టికల్చర్ హబ్‌గా 1 లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ, మార్కాపురం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా, పోలవరం- నల్లమల్ల సాగర్ బొల్లాపల్లి ద్వార అనుసంధానం చేసి వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాలకు శాశ్వతంగా కరువుకు పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తోందన్నారు. జగన్ ఈ అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ‘మావిగన్’ అని విషం కక్కుతున్నారని మండిపడ్డారు. మిగిలిన ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

అల్లూరి జయంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. నెట్‌‌జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్ల పరిశీలన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 02:02 PM