హిందూ దేవుళ్లను అవమానిస్తే కేసులు వేస్తాం: భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరిక..
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:22 PM
హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ: హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో న్యాయస్థానాలను ఆశ్రయించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 298 ప్రకారం కేసులు వేస్తామని భాను ప్రకాశ్ హెచ్చరించారు.
ఇటీవల అలాంటి వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు భాను ప్రకాశ్ రెడ్డి గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారా హిందూ దేవతలపై విమర్శలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. కొంతమంది హిందూ ధర్మంపై విషం చిమ్ముతూ సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని ఆగ్రహించారు. దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కాదని.. అవి హిందూ ప్రార్థనా స్థలాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు హిందువులకు మాత్రమే ఉండాలన్నారు.
శ్రీశైలంలో అన్యమతస్తులు సగం జనాభా ఉన్నారన్నారు భాను ప్రకాశ్. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ అవసరమని.. మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ కూటమి హిందూ సంప్రదాయాల రక్షణకు కట్టుబడి ఉందని భాను ప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడవ రోజు సింగపూర్ పర్యటన.. PSA పోర్టును సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి సవిత