పిల్లలపై డిజిటల్ విప్లవం సవాళ్లు
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:35 AM
పిల్లల విషయంలో డిజిటల్ విప్లవం సరికొత్త సవాళ్లు విసురుతోందని, అపరిమిత డిజిటల్ ఎక్స్‌పోజర్ చిన్నారుల భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులు, లైంగిక వేధింపులు వంటి సమస్యలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలకు పాల్పడిన, సంరక్షణ అవసరమైన పిల్లలను నేరస్థులుగా చూడకుండా చట్టంతో సంఘర్షణ పడిన పిల్లలుగానే చూడాలన్నారు.
తక్షణమే దృష్టి సారించాలి
హైకోర్టు సీజే జస్టిస్ లిసాగిల్ ఉద్బోధ
జువైనల్ జస్టిస్ చట్టంపై రాష్ట్రస్థాయి సదస్సు
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పిల్లల విషయంలో డిజిటల్ విప్లవం సరికొత్త సవాళ్లు విసురుతోందని, అపరిమిత డిజిటల్ ఎక్స్‌పోజర్ చిన్నారుల భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులు, లైంగిక వేధింపులు వంటి సమస్యలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలకు పాల్పడిన, సంరక్షణ అవసరమైన పిల్లలను నేరస్థులుగా చూడకుండా చట్టంతో సంఘర్షణ పడిన పిల్లలుగానే చూడాలన్నారు. అలాంటి పిల్లలు మళ్లీ తమ జీవితాన్ని పునర్నిర్మించుకొని, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడే పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పకుండా సమాజంలో వారిని భాగస్వాములను చేసేందుకు కౌన్సిలింగ్ విధానాలు అనుసరించాలని సూచించారు. జువైనల్ జస్టిస్ చట్టం-2015 అమల్లోకి వచ్చి పదేళ్లయిన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ(జేజేసీ), ఏపీ మహిళ, శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో శనివారం రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు నిర్వహించారు. చట్టం అమలులో సాధించిన పురోగతిని సమీక్షించుకొని, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వివిధ రంగాల భాగస్వాములతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జస్టిస్ లిసాగిల్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘పిల్లలే దేశానికి విలువైన సంపద. బాలల సంరక్షణ, రక్షణ కోసం గత పదేళ్లలో జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, చైల్డ్ ప్రొటెక్షన్ యునిట్లు, స్పెషల్ జువైనల్ పోలీస్ యునిట్లు, చైల్డ్ కేర్ హోమ్‌లు వంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వ్యవస్థగత లోపాలు ఇంకా చాలా ఉన్నాయి. అబ్జర్వేషన్ హోమ్స్, సేఫ్టీ హోమ్‌లలో సౌకర్యాలు మెరుగుపడలేదు. చైల్డ్ ఫ్రెండ్లీ విధానాలు సరిగ్గా అమలు కావడం లేదు. బాలల సంరక్షణ విషయంలో సంబంధిత శాఖల మధ్య మరింత సమన్వయం అవసరం’ అని అన్నారు.
అంతకు ముందు ఏపీ హైకోర్టు జేజేసీ చైర్‌పర్సన్ జస్టిస్ బట్టుదేవానంద్ మాట్లాడుతూ బాలనేరస్థులను నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, కౌన్సిలింగ్ ఇచ్చి వారు తిరిగి సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు పాటుపడినప్పుడే అసలైన విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జేజేసీ సభ్యులు జస్టిస్ చల్లా గుణరంజన్, హైకోర్టు న్యాయమూర్తులు, జేజేసీ సభ్యులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ ఎం.కిరణ్మయి పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్ బీఎస్.భానుమతి నేతృత్వంలో వివిధ అంశాలపై చర్చించారు.
కోట్లాది మందికి వీరు స్పూర్తి: సీజే జస్టిస్ లిసాగిల్
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన 21మంది విభిన్నప్రతిభావంతులైన పిల్లలను చీఫ్ జస్టిస్ లిసాగిల్ అభినందించి, వారికి జ్ఞాపికలు అందజేశారు. ‘పరిమితులు మన ఆలోచనలకే ఉంటాయి. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చనేందుకు ఈ చిన్నారులే నిదర్శనం. దేశంలో కోట్లాది మందికి వీరు స్ఫూర్తి’ అని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గోపి, రిజిస్ట్రార్ (అడ్మిన్) రాజు, పలువురు రిజిస్ట్రార్‌లు, ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్‌వీ హిమబిందు,ఉపకార్యదర్శి అమర లింగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, సమగ్రశిక్ష పీడీ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు