Share News

5వేల ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయండి

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:39 AM

రాష్ట్రవ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

5వేల ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయండి

  • శ్రీవారి ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దండి

  • దేవదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక, విద్య, వైద్య సేవలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, సీఎంకు వివరించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆలయాల నిర్మాణం, నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పారు. బోర్డు సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న వెయ్యి పాత ఆలయాలను కూడా పునరుద్ధరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఆలయాల సమగ్ర వివరాలు డిజిటలైజ్‌ చేయాలన్నారు. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని చెప్పారు. అమరావతిలోని శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమీక్షలో వర్చువల్‌గా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 04:39 AM