Share News

పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 16 , 2026 | 01:33 PM

సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

శ్రీకాకుళం, మే 16: సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు దేశంలో, రాష్ట్రంలో జనాభా పెరుగుదలను అరికట్టడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తే.. ఇప్పుడు కాలం మారిందన్నారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా గమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సమాజంలో ఓ కొత్త చర్చకు దారితీశాయి. పిల్లలు భారం కాదని, వాళ్లే మన అసలైన సంపదంటూ ఆయన సరికొత్త నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు.


సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు వనరుల కొరత, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘ఒకరు లేదా ఇద్దరు ముద్దు’ అనే విధానాన్ని సమాజంలోకి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జననాల రేటు ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. యువత సంఖ్య తగ్గి, వృద్ధుల శాతం పెరిగితే భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. జపాన్, చైనా సహా కొన్ని ఐరోపా దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న జనాభా క్షీణత సంక్షోభం ఏపీకి రావొద్దు. జనాభా సమతుల్యతను కాపాడేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో భాగంగా మూడో బిడ్డ పుట్టిన వెంటనే ఆ కుటుంబానికి రూ.30,000, నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే రూ.40,000 తక్షణ ఆర్థిక సహాయం అందిస్తాం. పిల్లలు భారం కాదు, వాళ్లే మన అసలైన సంపద’ అని అన్నారు.


'తల్లికి వందనం' మరింత పెంచుతాం..

గత ఐదేళ్ల అరాచక పాలనకు స్వస్తి పలికి, ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద ప్రతి తల్లికి రూ.15,000 అందిస్తోంది. భగవంతుడు కరుణించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే భవిష్యత్తులో ఈ సహాయాన్ని మరింత పెంచుతాం. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. ఐదేళ్ల కాలంలో 'గొడ్డలి పార్టీ' ఎన్నో అరాచకాలు సృష్టించింది. భూ రికార్డులను మార్చేసి, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వంటి చట్టాలతో ప్రజల ఆస్తులను గందరగోళంలోకి నెట్టంది. ఆ అరాచకాలను రాష్ట్ర ప్రజలంతా చూశారు, సరైన తీర్పు ఇచ్చారు. ఇకపై ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా భూ తగాదాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు

పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 16 , 2026 | 07:16 PM