3 ముప్పులపై త్రిశూల్!
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:51 AM
‘డ్రగ్స్, గంజాయి కేసుల్లో సప్లయ్ చైన్‌ను ఛేదించాలి.. మహిళలపై నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై చర్యలు వేగవంతంగా ఉండాలి.. రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి.. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ’త్రిశూల్’ కమిటీ వ్యూహం అమలు చేయాలి.. జిల్లాల్లోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి జీరో టాలరెన్స్ అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
డ్రగ్స్, మహిళలపై నేరాలు, ప్రమాదాలపై గురి
డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై ఉక్కుపాదం
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
శాంతిభద్రతలపై రాజీలేదు.. 14శాతం తగ్గిన నేరాలు
అసభ్యకర పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టొద్దు
పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సమాజంలో ఉన్న సమస్యలకు అనుగుణంగా పోలీసులు ప్రవర్తించాలి. పోలీసులు విజిబుల్‌గా ఉండకూడదు.. కానీ పోలీసింగ్ ఉండాలి.సీఎం వస్తుంటే 15 నిమిషాల ముందు ట్రాఫిక్ ఆపేస్తున్నారు. నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ఇటీవల కాన్వాయ్‌ను కూడా తగ్గించాం. ఇప్పుడు హాయిగా ఉంది.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘డ్రగ్స్, గంజాయి కేసుల్లో సప్లయ్ చైన్‌ను ఛేదించాలి.. మహిళలపై నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై చర్యలు వేగవంతంగా ఉండాలి.. రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి.. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ’త్రిశూల్’ కమిటీ వ్యూహం అమలు చేయాలి.. జిల్లాల్లోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి జీరో టాలరెన్స్ అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు చివరి రోజు శుక్రవారం శాంతిభద్రతల అంశంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేర నియంత్రణలో పోలీసు, రెవెన్యూ, రవాణా, వైద్య ఆరోగ్య, విద్యా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గంజాయి సహా మాదక ద్రవ్యాల నియంత్రణపై నిరంతర కార్యాచరణ చేపట్టాలని, డ్రగ్స్ దుష్ప్రభావంపై ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
‘విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై ఉక్కుపాదం మోపాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని వదిలి పెట్టొద్దు. అభ్యంతరకర కంటెంట్‌తో వ్యవస్థీకృత వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పారు. రోడ్డు ప్రమాదాల కట్టడికి సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని, ప్రతి ప్రమాదాన్నీ ఆడిట్ చేసి అసలు కారణాలను వెలికితీయాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీని కిందికి దించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. నేరం జరిగిన ప్రాంతాలకు పోలీసులు 30 నిమిషాల్లోనే చేరుకునేలా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని, ప్రతి జిల్లాలో 30 మంది పోలీసులతో యాక్షన్, రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఎవరు తప్పుచేసినా..
శాంతి భద్రతలు, ముఠాలు, రౌడీయిజంపై తానెప్పుడూ రాజీపడలేదని సీఎం చెప్పారు. ‘ఇప్పుడు కొత్త కొత్త సమస్యలొస్తున్నాయి. రాజకీయ ముసుగులో దాడులు చేస్తున్నారు. ఎవరు తప్పు చేసినా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీమూకలను నిర్మొహమాటంగా అణచివేయాలి. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాలి. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడొద్దు’ అని ఎస్పీలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో నేరాల సంఖ్య 14 శాతం తగ్గిందని.. ఇదే సమయంలో శిక్షలు 3 శాతం పెరిగాయని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేసి డీఎన్‌ఏ పరీక్షలు, ఆధారాల సేకరణలో సమర్థంగా వ్యవహరించి 3 శాతం శిక్షలు పెంచి.. మొత్తమ్మీద 47 శాతానికి తీసుకెళ్లారంటూ పోలీసులను అభినందించారు. కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని, ‘వన్ కోర్ట్-వన్ కానిస్టేబుల్’ విధానాన్ని అమలు చేసి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో ఆర్థిక నేరాలు పెరగడానికి కారణాలు విశ్లేషించి ఆ జిల్లాల ఎస్పీలు చర్యలు చేపట్టాలన్నారు. సమాజానికి ముప్పుగా, పోలీసులకు సవాల్‌గా మారిన సైబర్ నేరాల కట్టడికి నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఐడీ పోలీసులకు సీఎం ఆదేశాలిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..