ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 09 , 2026 | 01:34 PM
విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు.
విజయవాడ, ఆగస్టు 9: ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని, దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే.. మనం దేశానికి ఏమిస్తున్నామనే ఆలోచన ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. నేను నా దేశం, జెండా, అజెండా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. విద్యార్థి బాగా చదివి స్టార్టప్ కంపెనీ స్థాపించినా దేశ సేవ చేసినట్లేనన్నారు. రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్లే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా, కుటుంబానికి, గ్రామానికి ఒక విజన్ ఉండాలని సూచించారు. ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ధింసా నృత్యం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమన్నారు.
రాష్ట్రంలో 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, వారి అభ్యున్నతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తొమ్మిది ఐటీడీఏ కేంద్రాల అభివృద్ధితో మంచి ఫలితాలు వస్తాయని, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, కనెక్టివిటీ సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబరు నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, టెలీకమ్యూనికేషన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుని గిరిజన గ్రామాలకు వేగంగా కనెక్టివిటీ కల్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా దళాలు ఆకస్మిక తనిఖీలు
ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్
For More TG News And Telugu News